కీలక బిల్లుల విషయంలో అధికార–విపక్ష చట్టసభ సభ్యుల మధ్య ఒప్పందం కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం ప్రస్తుతం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. ఇప్పటికే 31 రోజులుగా ఈ ఆర్థిక మూసివేత కొనసాగుతుండగా, దాని ప్రభావంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకు 7 బిలియన్ డాలర్లు (రూ.62,149 కోట్లు) నష్టం వాటిల్లినట్లు కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ వెల్లడించింది.
‘‘ఈ షట్‌డౌన్ కారణంగా 7 బిలియన్ డాలర్ల మేర అమెరికా సంపద శాశ్వతంగా ఆవిరైంది. ఇది ఇలాగే కొనసాగితే, ఆరు వారాల్లో 11 బిలియన్, ఎనిమిది వారాల్లో 14 బిలియన్ డాలర్ల వరకు నష్టం పెరిగే అవకాశం ఉంది’’ అని ఆఫీస్ అంచనా వేసింది.
కేపీఎంజీ సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ డయాన్ స్వాంక్ మాట్లాడుతూ, ‘‘ఈ షట్‌డౌన్ చిన్న సమస్యలా కనిపించినా, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపవచ్చు’’ అని ఆందోళన వ్యక్తం చేశారు. మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన మార్క్ జాండీ కూడా ‘‘ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ బలహీనంగా ఉంది. ఈ తరహా షట్‌డౌన్‌లు పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తాయి’’ అని హెచ్చరించారు.
1981 నుంచి అమెరికా ప్రభుత్వం మొత్తం 15 సార్లు మూతపడింది. అందులో 2018-19 మధ్య డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 35 రోజుల పాటు జరిగిన మూసివేత దేశ చరిత్రలోనే దీర్ఘకాలమైనది. ఇప్పుడు కూడా చట్టసభ సభ్యుల్లో రాజీ సూచనలు కనిపించకపోవడంతో, ప్రస్తుత షట్‌డౌన్ ఆ రికార్డును దాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇకపోతే, ఇప్పటికే బలహీనంగా ఉన్న ఉద్యోగ మార్కెట్‌పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని నిపుణులు హెచ్చరించారు. ఆర్థిక–విధానపరమైన అనిశ్చితి కారణంగా పలు కంపెనీలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కొన్నింటి సంస్థలు కృత్రిమ మేధ, ఆటోమేషన్‌పై దృష్టి సారించడం వల్ల ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి.
తాత్కాలికంగా ప్రభావం తక్కువగా ఉన్నా, షట్‌డౌన్ దీర్ఘకాలంగా కొనసాగితే ఆర్థిక వృద్ధి మందగిస్తుంది, మార్కెట్లలో అస్థిరత పెరుగుతుంది. ప్రజల విశ్వాసం దెబ్బతినడంతో ప్రతివారం 0.1–0.2 శాతం పాయింట్ల మేర వృద్ధి తగ్గవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.




















