రామోజీ రావుగారు మహోన్నతులే కాక బహుముఖ ప్రజ్ఞాశీలి. అక్షర శక్తికి కొత్త నిర్వచనం ఇచ్చిన పాత్రికేయ మహర్షి. స్వయంకృషి, క్రమశిక్షణ, పట్టుదల, నిజాయితీ, కార్యదీక్షలను ఆయుధాలుగా మార్చుకుని ఎన్నో రంగాల్లో అపూర్వ విజయాలు సాధించి భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలిచారు. ప్రజల కోసం జర్నలిజాన్ని ధర్మయుద్ధంలా ఆచరించిన మహానుభావుడు. సాధారణ రైతుబిడ్డగా మొదలైన ఆయన ప్రయాణం ప్రపంచమంతా తెలుగు వారిని గుర్తించే స్థాయికి తీసుకెళ్లింది. “మీరు ఏ పక్షం?” అని అడిగితే “ప్రజల పక్షం” అని చెప్పిన మహానుభావుడి స్థానం తెలుగు ప్రజల గుండెల్లో శాశ్వతం.
ప్రజల భాషలోనే పత్రికా భాష
తెలుగు మీడియా చరిత్రలో ‘ఈనాడు’ విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పట్టణాలకే పరిమితమైన వార్తలను పల్లెల దాకా చేర్చింది. తెల్లవారుజామునే నిజాన్ని అందించే పత్రిక అనుభవం అప్పట్లో కొత్త. జర్నలిజాన్ని కేవలం వార్తా ప్రసారంగా కాకుండా, ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే శక్తిగా రామోజీ చూశారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నిజాయితీ, నిష్పాక్షికతను వదలకుండా నిలబడ్డారు.
తెలుగు భాషపై ఆయనకున్న ప్రేమ అపారం. ప్రజల హృదయాలకు చేరేలా పత్రికా భాషను సరళతరం చేశారు. రామోజీ ఫౌండేషన్ ద్వారా నిఘంటువులు రూపొందించి తెలుగు భాషకు గొప్ప సేవ చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా గిన్నిస్ రికార్డు సాధించడం తెలుగు ప్రజల సృజనాత్మకతకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చింది.
నా జీవితం, రాజకీయ ప్రయాణంలో ఆయన పాత్ర
రామోజీ గారితో నా అనుబంధం అత్యంత ప్రత్యేకం. నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి తరచూ ‘ఈనాడు’ కార్యాలయంలో కలిసి భోజనం చేసేవాళ్లం, వివిధ అంశాలపై చర్చించేవాళ్లం. ప్రజాద్వేషంగా, అక్రమంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని తొలగించినప్పుడు ప్రజల్లో అవగాహన పెంచే బాధ్యతను ఆయన స్వయంగా తీసుకున్నారు. తర్వాత మేమిద్దరం మరింత దగ్గరయ్యాం. జాతీయ రాజకీయాల్లో ఆడ్వాణీ, వాజ్‌పేయీ నన్ను ముందుకు నెట్టగా, తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు రావడానికి రామోజీ గారి మార్గదర్శకత నాకు ఎంతో దోహదపడింది.
పనిలోనే విశ్రాంతి ఆయన నమ్మకం. తుదిశ్వాస వరకు అదే నిజం చేసుకున్నారు. ఆయన చూపిన నిబద్ధత, క్రమశిక్షణ, కర్తవ్యదీక్షను వారసులు కొనసాగించడమే ఆయనకు నిజమైన నివాళి.
తెలుగు పరిపాలనా భాషగా మరింత బలపడాలి. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో ఇవ్వాలని, అర్థం కానివారికి ఆంగ్లంలో ప్రతులు ఇవ్వవచ్చని నేను రెండు రాష్ట్రాల సీఎంలను కోరుతున్నా. మనం అందరం తెలుగును ప్రోత్సహిస్తే అదే రామోజీ గారికి అత్యుత్తమ స్మరణ.




















