ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ఆర్మీకి చెందిన సమగ్ర జనరేటింగ్, మానిటరింగ్, ప్రొటెక్షన్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ‘విద్యుత్ రక్షక్’ కు కేంద్రం పేటెంట్ హక్కు మంజూరు చేసింది. మేజర్ రాజ్‌ప్రసాద్ ఆర్‌ఎస్ ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు. సంక్లిష్ట పరిస్థితుల్లో విద్యుత్ వ్యవస్థలను రక్షించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బహుళ జనరేటర్లు, పవర్ సిస్టమ్‌లను సమగ్రంగా పర్యవేక్షించడం, రక్షించడం, నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది. భారత సైన్యానికి 2023 నుండి 20 ఏళ్లపాటు ‘విద్యుత్ రక్షక్’పై పేటెంట్ హక్కు కల్పించబడింది. దీనికి సంబంధించిన వివరాలను భారత సైన్యం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో తెలిపింది.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంతో దేశం అడుగులు వేస్తున్న సమయంలో, మేజర్ రాజ్‌ప్రసాద్ రూపొందించిన ‘విద్యుత్ రక్షక్’తో భారత సైన్యం మరో ముందడుగు వేసిందని ఏడీజీపీఐ సోషల్ మీడియాలో పేర్కొంది. తక్కువ బరువు గల ఈ యంత్రం, ఎత్తైన మరియు మారుమూల ప్రాంతాల్లో యాంత్రిక లోపాలను పర్యవేక్షించడంలో, నివారించడంలో సైన్యానికి ఎంతో ఉపయోగకరమని తెలిపింది.




















