అన్ని రంగాల సంస్థలూ కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించడంపై దృష్టి పెట్టాయి. ఇందుకవసరమైన ఐటీ నిపుణులు పెద్దసంఖ్యలో కావాలంటే, హెచ్-1బీ వీసాల సాయంతో అమెరికాలోని కంపెనీలు నియమించుకునేవి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ వీసాలపై కఠిన ఆంక్షలు విధించడంతో, కీలక పనులను భారత్‌కు బదిలీ చేయాలని అక్కడి కంపెనీలు భావిస్తున్నాయి. ఇప్పటికే భారత్‌లో జోరుమీదున్న గ్లోబల్ కేపబులిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ.. ఈ పరిణామాలతో మరింత వేగాన్ని అందిపుచ్చుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
ఒత్తిడి ఎందుకంటే..
హెచ్1బీ వీసా కొత్త దరఖాస్తు ఫీజును 2000-5000 డాలర్ల నుంచి ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. దీంతో నైపుణ్యం ఉన్న విదేశీ సిబ్బందిపై ఆధారపడి, కీలక నైపుణ్య అంతరాలను పూడ్చుకుంటున్న అమెరికా కంపెనీలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. అందుకే అవి భారత్ వైపు దృష్టి సారిస్తున్నాయి.
ప్రపంచ జీసీసీల్లో సగం ఇక్కడే
జీసీసీలంటే భారత్ అనేలా మన దేశంలో వాటి వ్యాప్తి కనిపిస్తోంది. అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన మనదేశంలోనే, అంతర్జాతీయంగా ఉన్న జీసీసీల్లో సగానికి పైగా (1700) ఉన్నాయి. విలాసవంత కార్ల డ్యాష్ బోర్డ్ డిజైన్ల నుంచి ఔషధాలను కనుగొనే అత్యంత కీలక ఆవిష్కరణలకు సాంకేతిక సహకారాన్ని ఇవి ఇస్తున్నాయి. భారత్‌లోని జీసీసీల్లో అధునాతన నైపుణ్యాలు కలిగిన వారున్న విషయాన్ని అంతర్జాతీయ సంస్థలు గ్రహించాయి. అందుకే అమెరికా నుంచి ప్రాజెక్టుల్లో కీలక పనులన్నింటినీ జీసీసీలకు తరలించే ప్రక్రియ చోటుచేసుకుంటోందని సమాచారం.
ఈ రంగాల్లో అధికం
ఆర్థిక సేవలు, టెక్ రంగాల్లో ప్రభుత్వ కాంట్రాక్టులు ఉన్న కంపెనీలు భారత జీసీసీలపై సానుకూలంగా ఉన్నాయి. ట్రంప్ వీసా ఆంక్షలు మార్పుల్లేకుండా కొనసాగితే.. ఏఐ, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, సైబర్ భద్రత, అనలిటిక్స్ వంటి హైఎండ్ వర్క్‌ను అమెరికా సంస్థలు తమ భారత జీసీసీలకు తరలిస్తాయి. అవుట్‌సోర్సింగ్ బదులుగా తమ కంపెనీకే చెందిన జీసీసీలకు పంపడం వ్యూహాత్మకంగా మంచి పని అని అవుతుందని అనుకుంటున్నాయి.
కరోనా నేర్పింది అన్నీ..
కరోనా పరిణామాల్లో ఏ పనైనా ఎక్కడి నుంచైనా చేయొచ్చని అర్థమైంది. కీలక సాంకేతిక పనులూ అందుకు మినహాయింపు కాదని కాగ్నిజెంట్ మాజీ ఎండీ రామ్‌కుమార్ రామమూర్తి చెబుతున్నారు. ఈ తరుణంలో అమెరికా నుంచి భారత్, మెక్సికో, కెనడాలకు కీలక పనులను తరలించే అవకాశం ఉందని ఒక రిటెయిల్ జీసీసీ భారత అధిపతి అంచనా వేస్తున్నారు. ట్రంప్ ఆంక్షలకు ముందు అంచనాల ప్రకారమే.. భారత్‌లో జీసీసీల సంఖ్య 2030 కల్లా 2200కు చేరొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సంఖ్య మరింత పెరగొచ్చు.




















