విశాఖపట్నం: గూగుల్ డేటా సెంటర్ కోసం భూ సేకరణలో రైతులకు తెలీకుండా కోర్టులో తప్పుడు కేసులు ఫైల్ చేసిన ఉదంతంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖ ఎయిర్ పోర్టులో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, జిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్ సీఎంకు స్వాగతం పలికిన అనంతరం డేటా సెంటర్ భూసేకరణ ప్రగతిని.. ఆ ప్రాంత రైతుల అభిప్రాయాలను సీఎంకు వివరించారు. ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుకు ఆటంకాలు సృష్టించే ఆలోచనతో వైకాపా పెద్దల తరఫున పని చేస్తున్న బినామీ విషయంలో గట్టి చర్యలకు సీఎం ఆదేశించారు.
రైతులకు తెలీకుండా వారి పేర్లతో కోర్టులో కేసు వేయడం.. ఆ పేర్లలో మృతి చెందిన రైతు పేరు ఉండడం పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. భూములిచ్చిన రైతులకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్, ఇళ్ల నిర్మాణానికి 3 సెంట్ల స్థలం గురించి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. భూసేకరణ ప్రాంతాల్లో ఒకసారి పరిహారం ప్రకటించిన తర్వాత దాన్ని పెంచడమనేది ఎక్కడా లేదని.. కేవలం ఇక్కడి రైతుల అభ్యర్థన దృష్టిలో ఉంచుకుని ధర పెంచామనే విషయాన్ని గ్రహించాలని సీఎం పేర్కొన్నారు. త్వరితగతిన భూ సేకరణ పూర్తి చేయాలని సూచించారు.




















