విశాఖపట్నంలో జరిగిన ఇండియా-యూరోప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు, సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరోప్ మధ్య సహకార భాగస్వామ్యంపై ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత అనువైన గమ్యస్థానమని, ప్రపంచంలోనే సుందరమైన నగరాల్లో విశాఖ ఒకటని తెలిపారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానంలో వేగవంతమైన అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనలో ఏపీ ముందుందని, గ్రీన్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడులు రానున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన యువత అందుబాటులో ఉన్నారని, కొత్త ఆలోచనలు, వినూత్న ఆవిష్కరణలతో రాష్ట్ర యువత ముందుకు వస్తున్నారని సీఎం తెలిపారు. విశాఖలో గూగుల్ సంస్థ రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని, అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ అందుబాటులోకి రానుందని ప్రకటించారు. సాంకేతిక రంగంలో కొత్త ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ, డేటా సెంటర్, స్పేస్, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల రంగంలో ముందుంటామని ఆయన స్పష్టం చేశారు. ఇండియా-యూరోప్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆర్థిక సంస్కరణల తర్వాత పరిస్థితులు మారిపోయాయని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఐటీలో భారతీయులదే కీలకపాత్ర అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అర్మేనియా ఆర్థిక వ్యవహారాల మంత్రి గివార్గ్ పొపాయాన్, భారత్ ఫోర్జ్ వైస్ ఛైర్మన్ అమిత్ కల్యాణితో పాటు పలు కంపెనీల ఛైర్మన్లు, సీఈవోలు, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు.



















