డప: మాజీ ఎంపీ వైవీ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరిపై జరిగిన బెదిరింపుల ఘటనపై మరోసారి విచారణ ప్రారంభమైంది. ఈ ఘటన 2023 నవంబర్ 28న కడప జైలులో చోటుచేసుకుంది.
ఆ సమయంలో దస్తగిరిని, కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దస్తగిరి ఫిర్యాదు మేరకు, చైతన్యరెడ్డి రూ. 20 కోట్లు ఇస్తామంటూ ప్రలోభపెట్టడంతో పాటు, తనకు అనుకూలంగా సాక్ష్యం ఇవ్వకపోతే జైలు బయటకు వచ్చిన తరువాత ప్రాణహాని కలిగిస్తామని బెదిరించినట్లు పేర్కొన్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన ఆధ్వర్యంలో విచారణ బృందం కడప జైలులో మూడోసారి విచారణ చేపట్టింది.
విచారణకు అప్రూవర్ దస్తగిరి, ఆయన భార్య షబాన హాజరయ్యారు. అదనంగా, ఘటన సమయంలో జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి కూడా విచారణకు హాజరయ్యారు.
బీటెక్ రవి వాంగ్మూలాన్ని నమోదు చేయనున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. విచారణ అనంతరం కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం.



















