శివునికి బిల్వ దళం ఎందుకు సమర్పిస్తారు..??
🍁🍁🍁🍁🍁🍁🍁🍁
శివుడికి ఇష్టమైన వాటిల్లో బిల్వ పత్రం ఒకటి. ఈ చెట్టు మూలాల్లో గిరిజ, కాండంలో మహేశ్వరి, కొమ్మలో దాక్షాయణి, ఆకులో పార్వతి, పుష్పంలో గౌరీదేవి నివసిస్తుందని చెబుతారు. శివునికి బిల్వ పత్రం సమర్పించడం వలన విశేష ఫలితాలు లభిస్తాయని నమ్మకం.
బిల్వ పత్రం శివునికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా పరిగణిస్తారు. అందుకే బిల్వ పత్రాలను శివుని పూజలో ఉపయోగిస్తారు. శివునికి, బిల్వ పత్రాలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి, దీనిని పూజించే సమయంలో పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకుందాం.
శివుడిని చాలా సులభంగా సంతోష పెట్టవచ్చు అని నమ్మకం. కేవలం జలంతో అభిషేకించినా చాలు కోరిన కోర్కెలు తీర్చే భోలాశంకరుడు. అందుకనే ఎవరైనా సరే మనస్పూర్తిగా పరమశివుని పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెబుతారు.
హృదయపూర్వకంగా పూజించిన భక్తుడి పట్ల మహాదేవుడు కరుణ చూపిస్తాడు. అదే విధంగా పరమశివునికి ఇష్టమైన వస్తువులను సమర్పించడం ద్వారా విశేష ఫలితాలు పొందవచ్చు. అలా శివుడికి ఇష్టమైన వాటిల్లో ఒకటి బిల్వ పత్రం.
శివపురాణం ప్రకారం సముద్ర మథనం నుంచి విడుదలైన విషం వల్ల ప్రపంచం ఇబ్బందుల్లో పడింది. ఆ విషాన్ని స్వీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు. దీని తరువాత దేవతలు, రాక్షసులందరూ ఈ సమస్యకు పరిష్కారం కోసం శివుడిని సంప్రదించారు. అప్పుడు పరమశివుడు లోకాన్ని రక్షించడానికి ఆ విషాన్ని స్వీకరించి తన కంఠంలో దాచుకున్నాడు. దీంతో శివుడి శరీర ఉష్ణోగ్రత పెరగడంతోపాటు గొంతు నీలంగా మారింది.
పరమశివుని శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల విశ్వం అగ్నికి ఆహుతైంది. వేడి కారణంగా భూమిపై ఉన్న సకల జీవుల జీవితం కష్టంగా మారింది. సృష్టి ప్రయోజనం కోసం విష ప్రభావాన్ని తొలగించడానికి దేవతలు శివునికి బిల్వ పత్రాన్ని ఇచ్చారు. శివుడు బిల్వ పత్రం తిన్న తర్వాత విషం ప్రభావం తగ్గిందట. అందుకే అప్పటి నుంచి శివునికి బిల్వ పాత్రలను సమర్పించే సంప్రదాయం ప్రారంభమైందని చెబుతారు.
🍁🍁🍁🍁🍁🍁🍁🍁



















