తాడేపల్లి : రాష్ట్రంలో కొనసాగుతున్న మొంథా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కాసేపట్లో జరగనున్న ఈ సమావేశంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, పార్టీ కేడర్ చేపట్టిన సహాయక చర్యలపై సమీక్షించనున్నారు.
ఇప్పటికే రీజనల్ ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, పునరావాస చర్యల్లో పాల్గొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా పంటనష్టం, ఆస్తి నష్టం, ప్రజల ఇబ్బందులపై సేకరించిన వివరాలను నేతలు ముందు వివరించనున్నారు.
అలాగే తుఫాన్ అనంతర సహాయక చర్యలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ స్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై వైఎస్ జగన్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజలకు అండగా నిలవాలని, అవసరమైన చోట సహాయం అందించేందుకు సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.




















