ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర విశ్వ విద్యాలయాలు పేరుకే నడుస్తున్నట్లుగా మారాయి. ఆచార్యుల నియామకాలు లేక పోవడంతో అటు బోధనకు.. ఇటు పరిశోధనలకు విఘాతంగా మారింది. వేతనాల నిధులు తప్ప అభివృద్ధి పనులకు పైసా రాకపోవడంతో అనేక వర్సిటీల్లో కనీస వసతులు కల్పించలేకపోతున్నారు. తెలంగాణ విద్యా కమిషన్ రాష్ట్రంలోని వర్సిటీల పరిస్థితులు తెలుసుకొని ప్రభుత్వానికి తగిన సిఫార్సులు చేసేందుకు ఇటీవల పాలమూరు, మహాత్మాగాంధీ, కాకతీయ, తెలంగాణ, జేఎన్‌టీయూహెచ్, ఓయూ వర్సిటీల్లో బహిరంగ విచారణ నిర్వహించింది.ఈ సందర్భంగా ఆచార్యులు, ప్రిన్సిపాళ్లు, డీన్లు, విభాగాధిపతులు, ఒప్పంద, పార్ట్‌టైం అధ్యాపకులు, ఉద్యోగులు, పరిశోధన విద్యార్థులు కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, ఇతర సభ్యులకు తమ సమస్యలు వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. త్వరలో మహిళా వర్సిటీని కూడా సందర్శించిన అనంతరం వర్సిటీల పరిస్థితిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించనున్నారు.
కమిషన్ దృష్టికి వచ్చిన సమస్యలు
- ప్రతి వర్సిటీలో సగటున 60-70% శాశ్వత ఆచార్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 10-15 సంవత్సరాలుగా నియామకాలు లేవు.
- ఉన్న కొద్దిపాటి రెగ్యులర్ ఆచార్యులు పరిపాలనాపరమైన పోస్టులకు పరిమితం కావాల్సి వస్తోంది. ఫలితంగా పీహెచ్‌డీ విద్యార్థుల సంఖ్య తగ్గింది.
- కాంట్రాక్టు, పార్ట్‌టైమ్ అధ్యాపకులున్నా వారికి పీహెచ్‌డీ గైడ్‌షిప్ అర్హత లేదు.
- ప్రతి వర్సిటీలో హాస్టళ్ల కొరత ఉంది. ఉన్న గదుల్లో పరిమితికి మించి విద్యార్థులకు కేటాయిస్తున్నారు.
- రాష్ట్ర ప్రభుత్వం నుంచి సకాలంలో జీతాలకు కూడా బ్లాక్‌గ్రాంట్ అందటం లేదు. ఇక అభివృద్ధి పనులకు నిధుల ఊసే లేదు.
- విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్,స్కాలర్‌షిప్ (ఎంటీఎఫ్)లు విడుదల కావడం లేదు. అమ్మాయి లకు కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఇవ్వాలన్న ప్రతిపాదనలు వచ్చాయి.
- వర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు 40-50% ఉన్నాయి. వాటికి భారీగా ఫీజులు ఉండటం వల్ల విద్యార్థులకు భారమవుతోంది. వాటిని రెగ్యులర్ కోర్సులకు మార్చాలని పలువురు కోరారు.
- ఉస్మానియాను క్లోజ్డ్ క్యాంపస్‌గా తీర్చిదిద్దాలని వర్సిటీ వీసీ కుమార్ కోరారు. ప్రస్తుతం వర్సిటీ మధ్య నుంచే బస్సులు, నగరవాసులు రాకపోకలు సాగిస్తుండటంతో విద్యా వాతావరణం దెబ్బతింటోందన్నారు. చదువు పూర్తయిన వారు హాస్టళ్లలోనే ఉంటుండటంతో కొత్తగా వచ్చే వారికి వసతి లేకుండా పోతోందని అధికారులు కమిషన్ దృష్టికి తెచ్చారు.


















