అమరావతి: రాష్ట్రంలో అన్ని బస్‌స్టేషన్లు ఆధునికీకరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. రోజురోజుకు పెరుగుతోన్న యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తిరుపతిలో అత్యాధునిక బస్‌స్టేషన్ నిర్మించాలని ఆదేశించారు. అన్ని సౌకర్యాలతో ఆకట్టుకునేలా ఉండాలని, భవిష్యత్‌లో అన్నీ ఎలక్ట్రిక్ బస్సులే నడపనున్న నేపథ్యంలో ప్రతి బస్సుకు ఛార్జింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. దీనికి మొత్తం 5 మోడల్స్‌ను చంద్రబాబు పరిశీలించారు. వీటిని మరింత అభివృద్ధి చేసేందుకు స్టేక్ హోల్డర్లతో సమావేశం నిర్వహించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్, ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
తిరుపతిలో నూతనంగా నిర్మించే బస్ స్టేషన్‌లో సుమారు 150 బస్సులు ఒకేసారి నిలిపి ఉంచేలా బస్ బే ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. హెలిప్యాడ్ సౌకర్యంతోపాటు రోప్ వే, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, మాల్స్, మల్టీప్లెక్స్‌లతో డిజైన్లు రూపొందించాలన్నారు. రెండు బస్ ఎంట్రీలు, ఎగ్జిట్ వేలు ఏర్పాటు చేయాలని చెప్పారు. సోలార్ రూఫ్ టాప్‌తో సొంత విద్యుత్ అవసరాలను తీర్చుకునేలా చూడాలన్నారు. మొత్తం 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన ఈ బస్ స్టేషన్ కనీసం లక్ష మంది యాత్రికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మాణం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.




















