ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఈసారి ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ ఇయర్లో ఎన్‌సీఈఆర్టీ సిలబస్‌ను అమలు చేయడంతో పాటు ప్రశ్నాపత్ర పద్ధతి కూడా మార్చబడింది. కొత్తగా ఒక మార్కు ప్రశ్నలు ప్రవేశపెట్టడంతో, ప్రశ్నల సంఖ్య పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని సమాధాన పత్రాల బుక్‌లెట్‌ను 24 పేజీల నుంచి 32 పేజీలకు పెంచాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
సబ్జెక్టుల వారీగా బుక్‌లెట్ వివరాలు
- గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, చరిత్ర, ఆర్థికశాస్త్రం, రాజకీయశాస్త్రం, కామర్స్ – 32 పేజీల బుక్‌లెట్
- జీవశాస్త్రం – వృక్షశాస్త్రం 24 పేజీలు, జంతుశాస్త్రం 24 పేజీలుగా రెండు బుక్‌లెట్‌లు
- మిగిలిన సబ్జెక్టులకు – 24 పేజీల బుక్‌లెట్ యధావిధిగా కొనసాగుతుంది.
మార్కుల నిర్మాణంలో మార్పులు
- మొదటి సంవత్సరంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి 85 మార్కుల రాత పరీక్ష, ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులను 29.75 నుండి 29కి తగ్గించారు.
- సెకండియర్‌లో 85 మార్కులకు 30 మార్కులు తెచ్చుకోవాలి.
- రెండు సంవత్సరాల మొత్తం కిందగల 35% అంటే 59.5 మార్కులు రావాల్సి ఉండగా, దీన్ని 59 మార్కులకే ఉత్తీర్ణతగా పరిగణిస్తారు.
- రెండో ఏడాది ప్రాక్టికల్స్ (30 మార్కులు) ఉత్తీర్ణత మార్కులు 10.5 నుండి 11కు పెంచారు.
- కొన్ని సబ్జెక్టుల్లో 30% మార్కులు వచ్చినా, మొత్తం 35% వస్తే విద్యార్థి ఉత్తీర్ణుడిగానే పరిగణించబడతాడు.
- జాగ్రఫీ పరీక్ష 75 మార్కులకు జరిగినా, విలువను 85 మార్కులుగా లెక్కిస్తారు.
అదనపు సబ్జెక్టులపై కొత్త నిబంధనలు
- గ్రూపులోని 5 సబ్జెక్టులక అదనంగా ఎంపిక చేసిన ఆరో సబ్జెక్టులో ఉత్తీర్ణత తప్పనిసరి కాదు.
- ఆరో సబ్జెక్టులో ఫెయిల్ అయినా, ఐదు సబ్జెక్టుల మార్కులతోనే మెమో ఇస్తారు.
- ఒకవేళ ఆ సబ్జెక్టులో కూడా ఉత్తీర్ణులైతే వేరుగా ప్రత్యేక మార్కుల మెమో ఇస్తారు.
పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య
- ఈసారి ఇంటర్ పరీక్షలు రాయనున్న వారు: 10.40 లక్షలు
- ఫస్ట్ ఇయర్: 5.35 లక్షలు
- సెకండ్ ఇయర్: 5.05 లక్షలు
సెకండియర్ ప్రశ్నపత్రాలు, జవాబు బుక్‌లెట్‌ల్లో ఈసారి ఎలాంటి మార్పులు ఉండవు. పాత విధానమే కొనసాగుతుంది.
2026–27 విద్యాసంవత్సరం నుంచి సెకండియర్‌లో కూడా ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమల్లోకి రావడంతో, అప్పుడు ప్రశ్నాపత్రాల్లో మార్పులు ఉంటాయి.




















