రాయవరం (కోనసీమ): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనమై ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. తీవ్రంగా గాయమైన ఇద్దరిని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి, మిగతావారిని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 40 మంది కార్మికులు పనిచేస్తుండగా, భారీ పేలుడు ధాటికి షెడ్ గోడ కూలిపోయింది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ మహేశ్‌కుమార్ మాట్లాడుతూ, వారం క్రితమే పోలీసులు, రెవెన్యూ అధికారులు పరిశీలన చేసి సురక్షిత చర్యలు ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు. గోదాం యజమానులు అగ్నిప్రమాద నివారణ పరికరాలను సరిగా వాడారా లేదా అనే అంశంపై విచారణ జరుగుతోందని, ప్రమాదానికి గల నిజమైన కారణాలు వెలికితీసే పనిలో ఉన్నామని అన్నారు.
సీఎం చంద్రబాబు స్పందన
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాదం వెనుక కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, చికిత్సా సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లి సహాయకచర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు.
హోంమంత్రి అనిత స్పందన
హోంమంత్రి వంగలపూడి అనిత కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ, అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.



















