అమరావతి: రాజధాని అమరావతిలో 217 చ.కి.మీ.ల పరిధిలో రైతులు ఇప్పటివరకు సమీకరణలో ఇవ్వని భూములను సేకరణ విధానంలోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు 343.36 ఎకరాల సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్లను ఉపసంహరించి, వాటిపై పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికి సీఆర్‌డీఏకు అనుమతినిచ్చింది. రాజధానిలో సమీకరణలో ఇవ్వని భూమి ఇంకా సుమారు 2,800 ఎకరాల వరకు ఉంది.
ప్రస్తుతం ఈ మొత్తం భూమిని ఒకేసారి సేకరించకుండా, ప్రాజెక్టుల అవసరానికి అనుగుణంగా, అవసరమైన చోటే సేకరణ చేపట్టనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అవసరమైన భూమి వివరాలు సీఆర్‌డీఏ కమిషనర్ సూచిస్తే, గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూమి సేకరణలో ‘2013 భూసేకరణ చట్టం’ నిబంధనలు పాటిస్తారు.
ఉత్తర్వులలో, రాజధానిలో సమీకరణలో ఇవ్వని కొంత భూమి కారణంగా మౌలిక వసతుల ప్రాజెక్టులు, వివిధ సంస్థలకు భూకేటాయింపులు, రైతులకు స్థల కేటాయింపులు వంటి పనులలో అంతరాయం కలుగుతున్నట్టు పేర్కొన్నారు.



















