ఇంటర్నెట్ డెస్క్: టాటా ట్రస్టీల మధ్య బోర్డు నియామకాలు, పాలనకు సంబంధించిన అంశాలపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం జోక్యం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో టాటా గ్రూప్ కీలక ప్రతినిధులతో హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు.
సమావేశంలో కేంద్రం కొన్ని ముఖ్యమైన సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వివాదాన్ని అంతర్గతంగానే పరిష్కరించుకోవాలని, అవసరమైతే సమస్యకు కారణమవుతున్న ట్రస్టీని తొలగించే విషయాన్ని కూడా పరిశీలించాలని సూచించినట్లు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.
మంగళవారం రాత్రి జరిగిన ఈ భేటీలో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయెల్ టాటా, వైస్ ఛైర్మన్ వేణు శ్రీనివాసన్, టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ట్రస్టీ డారియస్ పాల్గొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ సమావేశంలో ట్రస్టీల మధ్య కొనసాగుతున్న విభేదాలపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.
టాటా ట్రస్ట్స్ బోర్డురూమ్ వివాదం, టాటా సన్స్‌తో పాటు ఇతర టాటా గ్రూప్ కంపెనీల మేనేజ్‌మెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని కేంద్రం స్పష్టంచేసినట్లు తెలుస్తోంది.




















