బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ప్రముఖ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా 9వ సీజన్ గత ఆదివారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఎలిమినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. ఫస్ట్ ఎలిమినేషన్‌లో భాగంగా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ హౌస్ నుంచి బయటకు వచ్చింది. ఈ సందర్భంగా జెన్యూన్‌గా ఉన్న నలుగురు పేర్లు చెప్పమని నాగార్జున అడగ్గా.. రాము రాథోడ్, మనీశ్ , హరీశ్, ఆషా షైనీ అని శ్రష్టి తెలిపింది. కెమెరా ముందు యాక్ట్ చేసేవారెవరు అన్న ప్రశ్నకు.. రీతూ చౌదరి, తనూజ, భరణి పేర్లు చెప్పింది.
తనతో సహా అందరూ బయట ఉన్నప్పుడు మాస్క్ (వ్యక్తిత్వాన్ని ఉద్దేశించి)తో ఉంటారని, ఇలాంటి షోలలోనే అసలు స్వరూపం తెలుస్తుందని శ్రష్టి ‘బిగ్‌బాస్’లోకి వెళ్లేటప్పుడు చెప్పిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఒకట్రెండు వారాలు నటించడం సులభమే కానీ, ఆ తర్వాత కుదరదని పేర్కొంది.
సామాన్యులకూ అధిక ప్రాధాన్యం కల్పించడంతో ఈ కొత్త సీజన్ ప్రత్యేకంగా నిలిచింది. తొమ్మిది మంది సెలబ్రిటీలు, ఆరుగురు కామనర్స్ షోలో అడుగుపెట్టారు. నామినేషన్స్‌లో సంజన, తనూజ సేవ్ అయ్యారు. దీంతో, మిలిగిన ఏడుగురిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారన్న ఉత్కంఠకు తాజాగా తెరపడింది.




















