తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఇటీవల కొన్ని ప్రముఖుల ఇళ్లు, ప్రధాన కార్యాలయాలకు బాంబ్ హెచ్చరికలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ నివాసం లక్ష్యంగా బాంబ్ బెదిరింపులు వచ్చాయి.
శుక్రవారం చెన్నైలోని ఉప రాష్ట్రపతి నివాసానికి బాంబ్ అమర్చినట్లు రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి మెయిల్ ద్వారా సమాచారం చేరింది. అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీలు నిర్వహించినా, ఎలాంటి పేలుడు పదార్థాలు గుర్తించలేదు. దీంతో ఇది బూటకపు బెదిరింపు అని ధృవీకరించారు. మెయిల్ పంపిన వారిని గుర్తించడానికి అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
దిల్లీలో పరీక్షలకు భయపడిన విద్యార్థి బూటక బెదిరింపు
తాజాగా దిల్లీలోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్‌కు కూడా బాంబ్ ఉందని ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. తనిఖీలలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడం వల్ల ఇది బూటకమని నిర్ధారించారు. దర్యాప్తులో, ఈ బెదిరింపులు చేసిన వ్యక్తి పాఠశాల విద్యార్థి అని తేలింది. అతను పరీక్షల భయం కారణంగా ఇలా చేశానని అంగీకరించాడు. పోలీసులు విద్యార్థిని అదుపులోకి తీసుకొని, తన ఇంటికి పంపారు.



















