అమరావతి, అక్టోబర్ 27 (ఉ. 6 గంటలకు):
బంగాళాఖాతంలోని నైరుతి మరియు పశ్చిమమధ్య ప్రాంతాల్లో ఏర్పడిన మొంథా తుపాన్ క్రమంగా తీవ్రత పెంచుకుంటోంది. గడచిన మూడు గంటల్లో ఇది గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదిలింది.
ప్రస్తుతం ఈ తుపాన్ చెన్నైకి 600 కి.మీ, విశాఖపట్నంకి 710 కి.మీ, కాకినాడకి 680 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ రేపు ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) పేర్కొంది.
తీరం వెంబడి గంటకు 90 నుండి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రజలు వాతావరణం ప్రశాంతంగా ఉందని పొరబడకుండా, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
“వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధగా ఉండకండి… పరిస్థితులను నిశితంగా గమనించండి. ప్రజలు ఇంట్లోనే సురక్షితంగా ఉండాలి,”
అని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
జిల్లాల వారీగా వర్షాల అంచనా:
- భారీ నుండి అతిభారీ వర్షాలు: కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో.
- భారీ వర్షాలు: శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో.
- మోస్తరు నుండి భారీ వర్షాలు: తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
జాగ్రత్త సూచనలు:
- తీరప్రాంత ప్రజలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి.
- చేపల వేటకు సముద్రంలోకి వెళ్లరాదు.
- స్థానిక అధికారుల సూచనలు పాటించాలి.
~ ప్రఖర్ జైన్, ఎండీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA)



















