మంగళగిరి, అక్టోబర్ 31:
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల వలన మొంథా తుఫాన్ సమయంలో ప్రాణ నష్టం గణనీయంగా తగ్గిందని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం, పునరావాస చర్యలు చేపట్టడం వల్ల విపత్తును సమర్థంగా ఎదుర్కొన్నామని ఆయన పేర్కొన్నారు.
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో గుడిసెల్లో నివసించే ప్రజలను తక్షణమే గుర్తించి, పునరావాస శిబిరాలకు తరలించడం, వారికి అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటి పనులు వేగంగా జరిగాయని తెలిపారు. మండల స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి, సీనియర్ ఐఏఎస్ అధికారులను పర్యవేక్షణకు నియమించడం వల్ల యంత్రాంగం సమయానికి స్పందించిందని వివరించారు. నెల్లూరులో సంగం బ్యారేజ్ వద్ద బోటు ఇరుక్కుపోయిన ఘటనను అధికారులు తక్షణమే పరిష్కరించారని, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాల సహకారంతో ప్రజలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చామని తెలిపారు.
ఈ విజయానికి కారణం ప్రభుత్వ అప్రమత్తత, నిరంతర పర్యవేక్షణేనని ధూళిపాళ్ల స్పష్టం చేశారు. అయితే, ఇలాంటి విపత్తు సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు బాధ కలిగిస్తున్నాయని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు తుపానుల సమయంలో ఎప్పుడూ రైతుల పంట పొలాలకు రాని జగన్ ఇప్పుడు బెంగళూరు ప్యాలెస్‌లో కూర్చొని ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
“తుపానులు ఎవరికీ చెప్పి రావు, వాటిని ఆపడం మన చేతిలో లేదు. కానీ ప్రజలను రక్షించడం మాత్రం ప్రభుత్వ బాధ్యత. చంద్రబాబు ప్రభుత్వం అదే చేస్తోంది. జగన్ మాత్రం ప్రజల బాధలపై రాజకీయాలు చేయడానికే పరిమితమయ్యాడు,” అని ధూళిపాళ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తుపాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే చేసి, రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం ప్రజా సేవకు ఉదాహరణగా ఉందని పేర్కొన్నారు. గతంలో వారం రోజుల్లోనే రైతుల అకౌంట్లలో పరిహారం జమ చేసినట్లు గుర్తుచేశారు. “ఈసారి కూడా పంట నష్టం వివరాలు సేకరించి తక్షణ సాయం అందిస్తామని సీఎం ఇప్పటికే ఆదేశించారు,” అన్నారు.
పునరావాస శిబిరాలకు తరలించిన ప్రతి కుటుంబానికి రూ.3,000 తక్షణ సాయం, నిత్యావసర వస్తువులు అందించామని తెలిపారు. జగన్ పాలనలో నెలల తరబడి రైతుల ధాన్యానికి డబ్బులు ఇవ్వలేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం రూ.1,100 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసిందని గుర్తు చేశారు.
“ఇన్సూరెన్స్ కట్టినా కట్టకపోయినా నష్టపోయిన ప్రతి రైతుకూ పరిహారం అందిస్తాం. రైతుల పంటను ప్రభుత్వమే కొంటుంది. ఇదే కూటమి ప్రభుత్వానికి రైతు పట్ల ఉన్న నిబద్ధత,” అని ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.
జగన్‌కు విధ్వంసం చేయడమే అలవాటైపోయిందని, ప్రజల కష్టాలను రాజకీయ లాభాల కోణంలో చూస్తున్నారని విమర్శించారు. “ఈ ప్రభుత్వం మాత్రం ప్రజల పక్కన నిలిచి, వారిని ఆదుకుంటూ, వారిలో ధైర్యం నింపే ప్రభుత్వం,” అని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.




















