నీటిలో మొసలికి చిక్కితే ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. అదే భూమిపై కొండచిలువ కూడా అంతే భయంకరమైన జంతువు. ఎంత పెద్ద ప్రాణినైనా సులభంగా తన బలమైన శరీరంతో చుట్టేసి మింగేసే శక్తి కొండచిలువకు ఉంది. అయితే ఈ రెండు ప్రమాదకర మృగాలు ఒకదానితో ఒకటి ఎదురెదురయ్యే పరిస్థితి వస్తే? ఆ దృశ్యం ఊహించుకోవడమే రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. నీటిలో మొసలికి చిక్కిన కొండచిలువ ఎంత పెద్దదైనా తప్పించుకోవడం చాలా కష్టం. కానీ కొండచిలువ కూడా అంత తేలిగ్గా లొంగిపోదు — తన చివరి శ్వాస వరకు పోరాడుతుంది.
ఇటీవల లేటెస్ట్ సైట్ింగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని క్రుగర్ నేషనల్ పార్క్‌లో చిత్రీకరించిన ఈ వీడియోలో ఒక మొసలి తన దవడలతో కొండచిలువను గట్టిగా పట్టుకుని ఉండగా, కొండచిలువ మాత్రం తన శక్తినంతా ఉపయోగించి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. కొన్నిసార్లు మొసలి చుట్టూ తన శరీరాన్ని చుట్టి ప్రతిఘటిస్తోంది కూడా. చివరి వరకు ప్రాణపణంగా పోరాడినప్పటికీ, మొసలి బలానికి చివరికి కొండచిలువ తట్టుకోలేకపోయింది.
ఈ వీడియోను వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్లు బెన్నీ సాల్జర్ మరియు జూలియన్ గీర్ట్స్ రికార్డ్ చేశారు. ఇప్పటివరకు దీన్ని 18 లక్షల మందికి పైగా వీక్షించగా, 12 వేల మందికి పైగా లైక్ చేశారు. “ఇది నిజమైన ప్రకృతి యుద్ధం,” “పచ్చి జంగిల్ థ్రిల్లర్,” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.



















