ఈ రోజుల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించడం అంటే చిన్న విషయం కాదు — అనేక దశల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో కోచింగ్ లేకుండానే వరుసగా ఎనిమిది సర్కారీ ఉద్యోగాలను సాధించి అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు మెదక్ జిల్లాకు చెందిన అజయ్‌కుమార్. ఆయన విజయ గాథ ‘చదువు’తో ఇలా పంచుకున్నారు.
పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి నా గ్రామం. నాన్న అర్కా సంజీవరావు రైతు, అమ్మ జ్యోతి గృహిణి. మేము ముగ్గురు అన్నదమ్ములం. పదో తరగతి వరకు తెలుగు మీడియం, ఇంటర్ నుంచి ఇంగ్లిష్ మీడియంలో చదివాను. బాసర ట్రిపుల్ ఐటీలో బీటెక్, తర్వాత బీబీఏ పూర్తి చేశాను. తల్లిదండ్రుల కష్టాలు చూసి ప్రభుత్వ ఉద్యోగం తప్పనిసరిగా సాధించాలనే నిశ్చయానికి వచ్చాను.
2018లోనే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి పోస్టులకు ఎంపికయ్యాను. ముందుగా పంచాయతీ సెక్రటరీగా చేరి ప్రజలతో కలిసి పనిచేసే అనుభవం పొందాను. తర్వాత 2020లో రైల్వే అసిస్టెంట్ లోకో పైలట్, బెటాలియన్ ఎస్‌ఐ, సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చాయి. లోకో పైలట్‌గా కొంతకాలం పనిచేసి వదిలేశాను. 2023లో సివిల్ ఎస్‌ఐ, గ్రూప్-3 పోస్టులు కూడా దక్కాయి. ప్రస్తుతం గ్రూప్-2 ద్వారా రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాను.
పరీక్షల కోసం రోజూ ఐదారు గంటలు మాత్రమే చదివేవాడిని. సిలబస్ మొత్తం కంటే 60–70% వరకు అర్థం చేసుకుంటూ చదవడం ముఖ్యం. రివిజన్‌కి ప్రాధాన్యత ఇచ్చేవాడిని. నిజానికి పోటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపించినా, నిజమైన పోటీ చాలా తక్కువే. ఎవరైనా సరైన దిశలో క్రమం తప్పకుండా చదివితే ఉద్యోగం ఖాయం.
కోచింగ్ తీసుకోకపోయినా, వివిధ ఇన్‌స్టిట్యూట్ల ప్రశ్నపత్రాలను సాధన చేశాను. సొంత నోట్సు రాసుకుని ప్రిపరేషన్ చేశాను. కఠినంగా అనిపించే టాపిక్‌లను వదిలేయకుండా కనీసం సగం వరకు చదవడం అలవాటు. పరీక్షలలో కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, పాలిటీ, జాగ్రఫీ మీద పట్టు చాలా అవసరం.
చివరగా చెప్పాలంటే — ఎక్కువ గంటలు చదవడం కంటే ఏకాగ్రతతో, స్మార్ట్‌గా చదవడం ముఖ్యం. పరీక్షలు వాయిదా పడ్డా, పరిస్థితులు మారినా నిరుత్సాహ పడకూడదు. మన చేతుల్లో ఉన్నది ఒక్కటే — నిరంతర సన్నద్ధత!



















