ప్రేక్షకులను అలరించేందుకు నటీనటులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. స్టంట్స్ మాత్రమే కాదు, కొన్ని సార్లు విచిత్రమైన పరిస్థితులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ చిన్నిప్రకాశ్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) గురించి ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఒక పాట చిత్రీకరణలో భాగంగా అక్షయ్ 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అక్షయ్ అంకితభావాన్ని ప్రశంసించారు.
“అక్షయ్ నిజంగా అంకితభావం కలిగిన నటుడు. తన పాత్ర కోసం ఎంత కష్టమైనా వెనుకడరు. నేను ఆయనతో దాదాపు 50 పాటలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశాను. ఎప్పుడూ స్టెప్స్ మార్చమని అడగలేదు. ‘ఖిలాడి’ చిత్రంలో ఒక పాట కోసం 100 కోడిగుడ్లతో కొట్టించుకున్నాడు. చుట్టూ ఉన్న అమ్మాయిలు గుడ్లు విసిరినా, నొప్పి ఉన్నా ఆయన ఒక్క మాట కూడా అనలేదు. షూట్ పూర్తయ్యాక దుర్వాసనతో చాలా ఇబ్బంది పడ్డారు, కానీ ఒక్కసారి కూడా చిరాకు చూపలేదు. అలా కష్టపడే నటుడు నేను ఇప్పటివరకు చూడలేదు” అని చిన్నిప్రకాశ్ తెలిపారు.
అతను ఇంకా చెప్పినట్లు, “ఇండస్ట్రీలో ఇన్ని సంవత్సరాలు గడిచినా అక్షయ్ ఇప్పటికీ అదే అంకితభావంతో ఉన్నారు. ఇటీవల ఆయనతో ‘హౌస్‌ఫుల్’ సినిమా చేశాను — అప్పటికీ అదే నిబద్ధత కనిపించింది. ప్రేక్షకులను అలరించేందుకు ఆయన ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు పొరపాటున 10వ అంతస్తు నుంచి దూకమన్నా కూడా ఆయన తడబడరని అనిపిస్తుంది” అని అన్నారు.
1992లో విడుదలైన ఖిలాడి చిత్రంలో అక్షయ్ ప్రధాన పాత్ర పోషించారు. అబ్బాస్–మస్తాన్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆయన కెరీర్‌లో కీలక మలుపు తీసుకువచ్చింది.


















