రాజుల కాలం నాటి కత్తులు, గొడ్డళ్లు, శూలాలు, పూర్వీకులు ఉపయోగించిన పాత్రలు, ఉంగరాలు, పాత కరెన్సీ నాణేలు, తాళపత్ర గ్రంథాలు, తేలు ఆకారంలో తాళాలు, ఏనుగు దంతంతో చేసిన దువ్వెనలు — ఇవన్నీ చూస్తే ఇది ఎక్కడైనా పురావస్తు మ్యూజియమా అనిపిస్తుంది. కానీ కాదు… ఇవన్నీ భీమవరంలోని ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలోని ప్రత్యేక ప్రదర్శన విభాగంలో ఉన్నాయి.
ప్రాచీన భారతీయ సాంస్కృతిక, సామాజిక, ఆధ్యాత్మిక, కళా రంగాలకు సంబంధించిన విజ్ఞానాన్ని నేటి యువతకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో కళాశాలలో ‘సృజనవాటిక’ పేరుతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ కార్యక్రమంలో భాగంగా అరుదైన వారసత్వ వస్తువులను సేకరించి, విద్యార్థులకు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. అలాగే పండుగల ప్రాముఖ్యత, పూర్వపు ఆహార సంస్కృతిపై కూడా వారికి వివరాలు అందిస్తున్నట్లు సృజనవాటిక నిర్వాహకుడు ఈదరపల్లి సీతారామరాజు తెలిపారు.



















