ఆర్థిక లాభాల కోసం తాను నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో జనార్దనరావు, జగన్మోహన్‌రావులకు సహకరించినట్లు నిందితుడు రవి విచారణలో ఒప్పుకున్నాడు. గత పదేళ్లుగా వారిద్దరితో పరిచయం ఉందని, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు వారు రుణం ఇచ్చి సహాయం చేశారని తెలిపాడు. ఐదు రోజుల కస్టడీ భాగంగా సిట్, ఎక్సైజ్ పోలీసులు రవిని విజయవాడ తూర్పు ఎక్సైజ్ స్టేషన్‌లో విచారించారు. రవితో పాటు బాదల్‌దాస్, ప్రదీప్‌దాస్, శ్రీనివాస్‌రెడ్డి, కల్యాణ్, రమేశ్‌బాబు, అల్లాభక్ష్‌లను కూడా కస్టడీకి తీసుకున్నారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న రవిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం విజయవాడకు తీసుకువచ్చారు. మిగతా నిందితులను విజయవాడ జైలు నుంచి తీసుకువచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. అనంతరం వీరిని వేర్వేరుగా విచారించారు.
జగ్గయ్యపేటలో తాను గతంలో పేపర్ మిల్లు నడిపానని, నష్టాల కారణంగా హైదరాబాద్‌కు మారానని రవి తెలిపాడు. 2023లో జనార్దనరావుతో కలిసి గోవాకు వెళ్లినట్లు అంగీకరించాడు. ఇబ్రహీంపట్నం, ములకలచెరువులో నకిలీ మద్యం యూనిట్ల ఏర్పాటు తన పర్యవేక్షణలో జరిగినట్లు వెల్లడించాడు. జనార్దనరావుతో కలిసి అంగోలాకు ఎందుకు వెళ్లాడని అడగగా, డిస్టిలరీ ఏర్పాటు కోసం సెప్టెంబరు 25న పరిశీలనకు వెళ్లినట్లు వివరించాడు. ములకలచెరువు వ్యవహారం బహిర్గతం అయిన తర్వాత జనార్దనరావు సూచన మేరకు తాను ముందుగా ఇండియాకు వచ్చానని చెప్పాడు. సీసాలపై అంటించే లేబుళ్లను హైదరాబాద్‌లో తిరుమలశెట్టి శ్రీనివాసరావు సహాయంతో డిజైన్ చేయించామని, వాటి తయారీకి చెల్లింపులు చేసినట్లు తెలిపాడు.
నకిలీ మద్యం తయారీలో పాల్గొన్న ఒడిశా కార్మికులు బాదల్‌దాస్, ప్రదీప్‌దాస్‌లు సీసాల్లో మద్యం నింపినట్లు ఒప్పుకున్నారు. జనార్దనరావు ఇద్దరినీ రెండు చోట్ల పనిచేయించాడని చెప్పారు. విద్యాధరపురంలోని శ్రీనివాస వైన్స్ మేనేజర్ కల్యాణ్ నకిలీ మద్యం సీసాలను విక్రయించినట్లు వెల్లడించాడు. ఆ సీసాలను ఏఎన్‌ఆర్ బార్ నుంచి జగన్మోహన్‌రావు ఆటోల్లో పంపేవాడని వివరించాడు. అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును వారంతా వాటాలుగా పంచుకున్నట్లు తెలిపారు.



















