వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లలో జరిగే శ్రీరామనవమి, హనుమాన్ జయంతి ఉత్సవాల్లో మొదటి పూజ చేసే ఆనవాయితీ పోలీసులదే. గత 42 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. 1980లో పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్‌కు ఎదురుగా అభయాంజనేయ స్వామి రాతి విగ్రహం ఉండేది. వర్షాకాలంలో విగ్రహం తడవడంతో పోలీసులు కర్రలతో పందిరి కట్టారు. అయితే ఓ తుఫానులో ఆ పందిరి కూలిపోవడంతో, పోలీసులు మరియు స్థానిక ప్రజల సహకారంతో కొత్త ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. మూడు సంవత్సరాల కృషితో ఆలయం పూర్తయింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరిగే పర్వదినాలు, ప్రత్యేక ఉత్సవాల్లో పోలీసులే పట్టువస్త్రాలు సమర్పించి తొలి పూజ చేసే ఆనవాయితీ కొనసాగుతోంది.


















