యూపీఎస్‌కు మారేందుకు గడువు పొడిగింపు
దిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఏకీకృత పింఛను పథకం(యూపీఎస్) ఎంచుకునేందుకు గడువును ఆర్థిక శాఖ నవంబరు 30 వరకూ పొడిగించింది. ఇందుకు గతంలో నిర్దేశించిన గడువు మంగళవారం నాటితో ముగిసింది. ఉద్యోగులు జాతీయ పెన్షన్ పథకం(ఎన్‌పీఎస్) నుంచి యూపీఎస్‌కు మారాలంటూ ప్రభుత్వం చేసిన ప్రకటనకు స్పందన కరువవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘‘యూపీఎస్ కింద అనేక సానుకూల మార్పులు ఇటీవల ప్రకటించాం. రాజీనామా ప్రయోజనాలు, కంపల్సరీ రిటైర్‌మెంట్, పన్ను మినహాయింపు వంటి లాభాలు యూపీఎస్ కింద లభ్యమవుతాయి. ఈ విషయంపై ఒక నిర్ణయానికి రావడానికి మరికొంత సమయం కావాలని ఉద్యోగులు కోరడంతో గడువును పొడిగిస్తున్నాం’’ అని పెన్షన్ నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఛైర్మన్ ఒక ప్రకటనలో తెలిపారు.
సకాలంలో పెన్షన్ చెల్లింపు
దిల్లీ: కేంద్ర ఉద్యోగులకు సకాలంలో పదవీ విరమణకు సంబంధించిన చెల్లింపులు పూర్తి చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయ సాధనకు కేంద్రం సమగ్ర మార్గనిర్దేశాలు జారీ చేసింది. పెన్షన్ చెల్లింపు ఆదేశాల జారీలో ఆలస్య నివారణకు పదవీ విరమణకు ముందే విజిలెన్స్ క్లియరెన్స్ ఇవ్వడం వంటి అనేక విధానపరమైన సంస్కరణల్ని చేపట్టినట్టు మంగళవారం ఒక అధికారిక ప్రకటన తెలియజేసింది. కేంద్ర సివిల్ సర్వీసుల (పెన్షన్) నిబంధనలు – 2021 కింద విజిలెన్స్ క్లియరెన్స్ లేని కారణంగా పెన్షన్ చెల్లింపుల్లో ఆలస్యం కావడానికి వీల్లేకుండా చేశామని కేంద్రం తెలిపింది. పదవీ విరమణకు మూడు నెలల ముందే తన సిబ్బందికి సంబంధించి విజిలెన్స్ క్లియరెన్స్‌ను ప్రతి శాఖ అందించేలా ఆదేశాలు జారీ చేశామని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ వెల్లడించింది.



















