ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి మద్దతు తెలిపారు. ఒక ఆంగ్ల వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, “మళ్ళీ విలీనం జరిగితే అది మంచిదే. అయినా కొన్ని చిన్న బ్యాంకులు ఉండవచ్చు” అని తెలిపారు. గత దశాబ్దంలో జరిగిన విలీనాల తర్వాత ప్రస్తుతం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి.
అమెరికా అదనపు టారిఫ్‌ల కారణంగా భారత ఎగుమతులపై కొంత ప్రభావం కనిపించినప్పటికీ, ఎస్‌బీఐకి ఎటువంటి సమస్యలు రాలేదని, అందువల్ల రుణాలపై కోతలు వేయడం అవసరం లేదని ఆయన చెప్పారు. ఎగుమతిదారులకు మద్దతు కొనసాగిస్తామని, తాత్కాలిక సర్దుబాట్లు లేదా రుణాల పొడిగింపులు అవసరమైతే వాటిని అమలు చేస్తామని వెల్లడించారు.
కార్పొరేట్ పోర్ట్‌ఫోలియోలను ఏర్పాటు చేయాలన్న కోరికలో చాలా బ్యాంకులు ఉన్నప్పటికీ, పెద్ద కంపెనీల పరిమితి వల్ల ఈ విభాగంలో పోటీ ఎక్కువగా ఉందని చెప్పారు.
దిగ్గజ బ్యాంక్ అయినప్పటికీ ఎస్‌బీఐ మార్కెట్ వాటాను పెంచడంలో దూకుడు చూపడం లేదని, విదేశీ నిధులను పోటీగా చూడడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బ్యాంకు ఆస్తులు రూ.69 లక్షల కోట్లుగా ఉండగా, రెండో స్థానంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.40 లక్షల కోట్లతో ఉంది.
కంపెనీ విలీనాలు లేదా కొనుగోళ్లకు రుణాలు ఇవ్వడంపై కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల విషయంలో, ప్రతి ఒప్పందానికి నిర్దిష్ట నష్టభయాలు ఉంటాయని, ఈ రుణాలను సాధారణ బ్యాలెన్స్‌షీట్ రుణాలుగా చూడరాదు అని చెప్పారు.
ఇలాంటి నేపథ్యంలో, వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో భారత్ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోందని, గత 12 నెలల్లో ఎస్‌బీఐ 1,000 వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్లను నియమించుకున్నదని, వచ్చే రెండు సంవత్సరాల్లో 50–100 కొత్త వెల్త్‌హబ్‌లను ఏర్పాటు చేయనున్నదని తెలిపారు.




















