మూడు–నాలుగు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రజల్లో చురుకుగా ఉండి ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. బుధవారం రాత్రి ఆయన టెలికాన్ఫరెన్స్ ద్వారా తెదేపా ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు.
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకాల ద్వారా సుమారు 47 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని, ఈ విషయాన్ని ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని పది రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
‘సూపర్ సిక్స్‌తో పాటు ఎన్నికల సమయంలో హామీ ఇవ్వని అనేక కొత్త పథకాలను కూడా అమలు చేస్తున్నాం. కార్యకర్తలు నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలి’ అని అన్నారు. ఏ కార్యక్రమం చేసినా జనసేన, భాజపాతో కలిసి సమన్వయంగా ముందుకు వెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలకు మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.



















