బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితులు నిపుణులను అప్రమత్తం చేస్తున్నాయి. ఒక అల్పపీడనం కొనసాగుతుండగానే, మరో కొత్త అల్పపీడనం రూపుదిద్దుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ రెండు వ్యవస్థలు పరస్పరం ప్రభావం చూపే అవకాశం ఉండటంతో, ఏది బలపడుతుందన్నదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మలక్కా జలసంధి సమీపంలో ప్రస్తుతం తీవ్రమైన అల్పపీడనం ఉంది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం వాయుగుండంగా, గురువారానికి తుపానుగా బలపడవచ్చని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. తుపానుగా మారేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. అయితే దాని కదలికలపై పూర్తి వివరాలు వచ్చే రెండు రోజుల్లో తెలిసే అవకాశముంది. నవంబరులో ఏర్పడే తుపాన్లు ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ దిశలో సాగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఏపీ, తమిళనాడు తీరాలకూ చేరుతాయి. ప్రస్తుతం దిశపై స్పష్టత లేకపోవడంతో, తుపానుగా బలపడిన తర్వాతే నిజమైన అంచనా వేయగలమని చెప్పారు.
భారీ వర్షాల సూచనలు
కొమొరిన్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండడంతో, దీని ప్రభావంగా నైరుతి బంగాళాఖాతంలో కొమొరిన్–శ్రీలంక పరిసరాల్లో మంగళవారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది కూడా మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ ప్రభావంతో:
- మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడులో భారీ వర్షాలు
- నవంబర్ 29న రాయలసీమ, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
- నవంబర్ 30న బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు
సముద్రం అలజడిగా మారనుండటంతో గురు, శుక్రవారాల్లో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశాయి. ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు గురువారానికి ముందే ఒడ్డుకు చేరాలని సూచించారు.
మలక్కా జలసంధి సమీపంలోని అల్పపీడనం 30వ తేదీ నాటికి బలహీనపడవచ్చని, కొమొరిన్ ప్రాంతంలో ఏర్పడే మరో అల్పపీడనం డిసెంబర్ 1న తమిళనాడు – దక్షిణ కోస్తా మధ్య తీరం దాటవచ్చని వాతావరణ నమూనాలు సూచిస్తున్నాయి.



















