ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి, మానవ వనరుల బలం ఉంది. ఒకవైపు సుదీర్ఘ సముద్ర తీరం, మరోవైపు విస్తృతమైన జలవనరులు, ఇంకోవైపు నైపుణ్యవంతమైన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. ఏ రంగంలో పెట్టుబడి పెట్టడానికైనా ఇక్కడి పరిస్థితులు అనుకూలం. స్థిరమైన నాయకత్వం, సమర్థ పారిశ్రామిక విధానాలతో చేయూతనందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల విదేశీ పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను గమ్యస్థానంగా చేసుకోవడానికి ముందుకు రావాలి’ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ 30వ భాగస్వామ్య సదస్సుకు సన్నాహకంగా మంగళవారం దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పటి వరకు ఏపీలో ఆరుసార్లు సీఐఐ సదస్సులు నిర్వహించామని, ఇప్పుడు ఏడోసారి నిర్వహించబోతున్నామని చెప్పారు. దీన్నిబట్టి ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాలను అర్థం చేసుకోవచ్చన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి క్రమం తప్పకుండా దావోస్ వెళ్లే ఏకైక రాజకీయ నాయకుణ్ని తానే అని చెప్పారు.
‘ఏపీలో ఉన్న వెయ్యి కిలోమీటర్ల తీర ప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ నిర్మిస్తున్నాం. రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా గంటలోపు చేరేలా విమానాశ్రయాలు కడుతున్నాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ 1గా నిలిచిన మేం ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నాం. ప్రజలకు మెరుగైన సేవలందించాలంటే సంపద సృష్టించాలన్న సిద్ధాంతాన్ని నేను బలంగా నమ్ముతాను. అప్పుడే ఆదాయం పెంచుకొని, పేదరిక నిర్మూలన చేయగలం. 2024-25లో మేం 8.25% వృద్ధిరేటు సాధించాం. ఇప్పుడు 15% సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 2014-19 మధ్యకాలంలో వృద్ధి రేటు సాధనలో నంబర్ 1గా నిలిచాం. 13.55% సీఏజీఆర్ సాధించాం. గత 15 నెలల్లో మేం 21 ప్రత్యేక పారిశ్రామిక విధానాలు విడుదల చేశాం. ఏపీని 2047నాటికల్లా 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. ఇప్పటి వరకు పీపీపీ విధానాన్ని అనుసరించిన మేం ఇప్పుడు సమ్మిళిత అభివృద్ధి కోసం పీ4 విధానాన్ని తీసుకొచ్చాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో స్పేస్, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఏరోస్పేస్ సిటీలు నిర్మించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. క్వాంటమ్ మిషన్ కింద 2026 జనవరిలో దేశంలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్‌ను అమరావతిలో మొదలుపెడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ తయారీ రంగానికి ప్రాధాన్యం ఇస్తోంది. లక్ష్మీమిత్తల్ త్వరలోనే రాష్ట్రంలో భారీ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయబోతున్నారు. బీపీసీఎల్ రూ.లక్ష కోట్లతో పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటు చేయబోతోంది. గూగుల్ అమెరికా తర్వాత అతి పెద్ద డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో నెలకొల్పుతోంది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు విస్తృతావకాశాలు ఉంటాయి. ఒకసారి మీరు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత మీకు మేం తుది దాకా చేయూతనందిస్తాం.
కార్యక్రమానికి హాజరైన పారిశ్రామికవేత్తతో సీఎం చంద్రబాబు కరచాలనం

అభివృద్ధిలో అగ్రస్థానం కోసమే మా పోటీ
వేగంగా పారిశ్రామికాభివృద్ధితో ముందుకెళుతున్న ఏకైక దేశం ఇండియా. అందులో పోటీపడుతున్న 5, 6 రాష్ట్రాల్లో ఏపీ నంబర్ 1గా ఉంటుంది. సైబరాబాద్‌ను అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డు మాకుంది. దానివల్ల ఇప్పుడు దేశంలో అత్యధిక తలసరి ఆదాయం సాధించే రాష్ట్రంగా తెలంగాణ ఎదిగింది. ఇప్పుడు దేవుడు నాకు మరో నగరం అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చాడు. అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన హరితనగరంగా అమరావతిని అభివృద్ధి చేస్తున్నాం. మీ ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి మేం సిద్ధం. అమరావతిలో జలవనరులు విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. ఒక్కరోజులోనే అక్కడ 70 టీఎంసీల మంచినీరు సముద్రంలోకి వెళ్లింది. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటి వరకూ కృష్ణా, గోదావరిల నుంచి 5వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. దాన్నిబట్టి రాష్ట్రంలో జలవనరులు ఎంత పెద్దఎత్తున అందుబాటులో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నాం
పాతికేళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మా ప్రభుత్వం తీసుకొచ్చిన విధాన నిర్ణయం వల్ల ఐటీ రంగం విస్తృతమై తెలుగువారు ప్రపంచమంతా విస్తరించారు. ప్రపంచంలో ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులైతే.. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు తెలుగువారు. దేశంలో ఎవరూ సాహసించని సమయంలో విద్యుత్తు రంగ సంస్కరణలు తీసుకొచ్చిన అనుభవం మాకుంది. అందుకోసం ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకొచ్చాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఏ సంస్కరణలనైనా తక్షణం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. దానివల్ల పెట్టుబడులను సాధించి భారత్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుంది. అందువల్ల నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొనాలని అన్ని దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నా. నేను ఇక్కడ కేవలం పెట్టుబడుల కోసం మాత్రమే పిలవడం లేదు. ఆలోచనలు పంచుకొని, నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకొని, పరస్పరం అర్థం చేసుకోవాలి. అవసరమైనచోట కలిసి పనిచేయాలన్నదే మా లక్ష్యం. ఆ దిశగా పని చేస్తాం’ అని చంద్రబాబు ప్రకటించారు.
కార్యక్రమానికి హాజరైన పారిశ్రామికవేత్తలనుద్దేశించి మాట్లాడుతున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్


మూడు పారిశ్రామిక స్మార్ట్‌సిటీలున్న ఏకైక రాష్ట్రం ఏపీ: పీయూష్ గోయల్
కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు నాయకత్వం, కావాల్సినన్ని వనరులున్నాయన్నారు. ‘మా అన్నయ్య చంద్రబాబు సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ల నిజమైన రూపకర్త. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి శ్రమిస్తున్నారు. 7వసారి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు ఏపీ ఆతిథ్యమివ్వడం చంద్రబాబు ప్రగతిశీల వైఖరికి నిదర్శనం. 1998లోనే హైదరాబాద్‌కు హైటెక్‌సిటీని పరిచయం చేశారు. ఇప్పుడు దేశంలోనే అధునాతన రాజధానిని నిర్మిస్తున్నారు. మూడు (కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తిల్లో) ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు రాబోతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్’ అని చెప్పారు. సీఐఐ భాగస్వామ్య సదస్సులో.. భారత్‌లో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించి కలిసి పనిచేయడానికి ముందుకు రావాలని విదేశీ ప్రతినిధులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ సంధానకర్తగా వ్యవహరించారు.



















