మలక్కా జలసంధి, ఇండోనేసియా సమీపంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం తుపానుగా మారింది. భారత వాతావరణ విభాగం (IMD) దీనికి ‘సెన్యార్’ అని నామకరణం చేసింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ తక్కువ సమయంలోనే ఇండోనేసియా తీరం దాటింది. గురువారం సాయంత్రం వరకు తీవ్రత కొనసాగుతుందని, ఆ తర్వాత బలహీనపడుతుందని అంచనా. దీని దిశ మార్చి మలేసియా వైపుకు తిరగలాగే అవకాశముందని IMD తెలిపింది. భారత భూభాగంపై దీని ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. మలక్కా జలసంధి సమీపంలో తుపాను ఏర్పడడం చాలా అరుదైనట్లు వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. 1842 తర్వాత ఇలాంటి తుపాను అక్కడ బలపడిన విషయం తొలిసారిగా అని అభిప్రాయపడుతున్నారు.
తమిళనాడు వైపు కదిలే అవకాశం
నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక సమీపంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్రమంగా ఉత్తర-వాయవ్య దిశలో కదులుతూ గురువారం వరకు బలపడే అవకాశం ఉందని IMD తెలిపింది. తరువాత అదే దిశలో వెళ్లి శనివారం నాటికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వైపు కదులుతూ మరింత బలపడుతుందని అంచనా. కొన్ని వాతావరణ నమూనాల ప్రకారం ఇది తుపానుగా మారే అవకాశం ఉంది.
మత్స్యకారులకు హెచ్చరిక
శనివారం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదివారం నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, అలాగే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. గురువారం తీరం వెంబడి గాలులు గంటకు 55 కి.మీ వేగంతో వీస్తున్నాయి. శుక్రవారం, శనివారం, ఆదివారం గరిష్టంగా 60–70 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.
ఏజెన్సీలో పెరిగిన చలి
ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. మంగళవారం రాత్రి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో కనిష్ట ఉష్ణోగ్రత 8.6 డిగ్రీలుగా నమోదు అయ్యింది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, అన్నమయ్య, చిత్తూరు, శ్రీసత్యసాయి, విజయనగరం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలక్రింద నమోదయ్యాయి. కళింగపట్నం, గన్నవరం, కడప, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణానికి 1–2 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.



















