‘పంచాయతీ ఎన్నికల్లో ఎస్టీలకు కేటాయించిన రిజర్వు సీట్ల సంఖ్య పెరిగింది. 2019లో ఎస్టీ పంచాయతీల సంఖ్య 1,177 ఉండగా, 2025లో అది 1,248కు చేరుకుంది. నాన్ షెడ్యూల్డ్ గ్రామ పంచాయతీలలో ఎస్టీలకు కేటాయించిన స్థానాలు 688 నుంచి 714కి పెరిగాయి. 2019తో పోలిస్తే, ఎనిమిది జిల్లాల్లో బీసీలకు కేటాయించిన రిజర్వేషన్లు కూడా పెరిగాయి. నాన్ షెడ్యూల్డ్ పంచాయతీలలో ఎస్టీ రిజర్వేషన్ల పెరుగుదల ఇతర వర్గాలపై తాత్కాలికంగా స్వల్ప ప్రభావం చూపినట్లు కనిపిస్తుంది. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవు’ అని పంచాయతీరాజ్ శాఖ నివేదిక వెల్లడించింది.
సర్పంచుల రిజర్వేషన్ కోసం మండలాన్ని ఒక యూనిట్‌గా, వార్డులను పంచాయతీ యూనిట్‌గా పరిగణిస్తారు అని కూడా నివేదికలో పేర్కొన్నారు.
ముఖ్యాంశాలు:
2019 ఎన్నికల్లో మొత్తం 12,751 గ్రామాల్లో 10,293 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు ఉండగా, వాటిలో ఎస్టీలకు 688 స్థానాలు (6.68%), ఎస్సీలకు 2,133 స్థానాలు (20.53%), బీసీలకు 2,345 స్థానాలు (22.78%) కేటాయించబడ్డాయి. 2025లో మొత్తం 12,760 స్థానాల్లో 10,233 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు ఉండగా, ఎస్టీలకు 714 (6.99%), ఎస్సీలకు 2,090 (20.45%), బీసీలకు 2,186 (21.39%) స్థానాలు రిజర్వ్ అయ్యాయి.
2019లో సర్పంచులు, వార్డు సభ్యుల 50% స్థానాలు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన తర్వాత మిగిలిన స్థానాలను బీసీలకు కేటాయించారు. 2025లో సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి, డెడికేటెడ్ కమిషన్ మండలాన్ని, పంచాయతీని యూనిట్‌గా తీసుకుని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వ్ చేయాల్సిన సర్పంచు, వార్డు సభ్యుల స్థానాలను నిర్ణయించింది.
2019లో 214 గ్రామ పంచాయతీలు పురపాలికల్లో విలీనమయ్యాయి. ఈ విలీనంతో జనాభా గణనీయంగా మారడంతో, పాత గ్రామ పంచాయతీలను విభజించడం ద్వారా 223 కొత్త పంచాయతీలు ఏర్పడాయి. దీని వల్ల పాత, కొత్త గ్రామ పంచాయతీలలో బీసీ జనాభా పంపిణీపై ప్రభావం తేలింది.’


















