రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) మళ్లీ చురుకుగా ప్రారంభమైంది. 2024-25 రబీ సీజన్‌కు సంబంధించిన CMR డెలివరీ గడువును కేంద్రం 2026 ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొన్ని రైస్ మిల్లుల్లో రెండు వారాలు ఆగిపోయిన CMR, కొనుగోలు కేంద్రాలకు భారీగా వస్తున్న ధాన్యం కారణంగా స్టోరేజీ సమస్యతో ఒత్తిడిలో ఉన్న పౌరసరఫరాల సంస్థకు ఉపశమనం లభించింది. 2024-25 ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన CMR గడువు ఇప్పటికే ముగియగా, ఇప్పుడు రబీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే ఖరీఫ్ గడువుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
2025-26 ఖరీఫ్ CMR కు ఆదేశాలు:
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో సేకరించిన ధాన్యాన్ని కూడా కస్టమ్ మిల్లింగ్ చేయాలని పౌరసరఫరాల సంస్థ నిర్ణయించింది. మిల్లర్లకు ఆదేశాలు జారీ చేసి, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చే ధాన్యాన్ని మళ్లీ మిల్లింగ్ చేసి, ఫలితంగా వచ్చే బియ్యాన్ని FCI కు డెలివరీ చేయాలని స్పష్టంగా చెప్పింది.
కేంద్రం కీలక సూచనలు:
- మరాడించి ఇచ్చే బియ్యం నిబంధనల ప్రకారం ఉండాలి.
- సెంట్రల్ పూల్ మరియు స్టేట్ పూల్ బియ్యాన్ని స్పష్టంగా వేరు చేయాలి.
- ధాన్యం రవాణాలో GPS ట్రాకింగ్‌ను డిసెంబరు 31 వరకు తప్పనిసరి చేయాలి.
- కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లర్లకు, మిల్లర్ల నుంచి FCI కు వెళ్ళే ధాన్యం, బియ్యం దారులు మారకుండా చూసుకోవాలి; రాకపోక చేసే ప్రతి లారీకి GPS ట్రాకింగ్ తప్పనిసరి.
- బియ్యం రీసైక్లింగ్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మరియు FCI సంయుక్తంగా కఠినంగా పర్యవేక్షించాలి; అవసరమైతే బియ్యానికి పరీక్షలు నిర్వహించాలి.


















