ఈ మధ్య చాలా మంది ఉద్యోగులు తమ ఈపీఎఫ్ పాస్‌బుక్ అప్‌డేట్ అవ్వడం లేదని సోషల్ మీడియాలో చెబుతున్నారు. ప్రత్యేకంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల కాంట్రిబ్యూషన్ రికార్డులు కనిపించడం లేదని అనేక ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై సందేహాల్లో ఉన్న చాలామంది నేరుగా EPFOకు ఆన్‌లైన్‌లో ప్రశ్నలు అడుగుతున్నారు.
ఈ పరిస్థితిపై EPFO స్పష్టీకరణ ఇచ్చింది. వారి ప్రకారం, ఇటీవల ECAR Ledger Posting సిస్టమ్ అప్‌డేట్ కారణంగా తాత్కాలికంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలల కాంట్రిబ్యూషన్ వివరాలు పాస్‌బుక్‌లో కనిపించడం లేదని తెలిపింది. ఇది కేవలం సాంకేతిక కారణం మాత్రమేనని, కొన్ని రోజులలో అన్ని డేటా ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుందని భరోసా ఇచ్చింది. కాబట్టి సభ్యులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని EPFO స్పష్టంచేసింది. అలాగే కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది.
ఇదిలా ఉంటే ఇటీవల EPFO ‘పాస్‌బుక్ లైట్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రతిసారి పాస్‌బుక్ పోర్టల్ ఓపెన్ చేయకుండా మెంబర్ పోర్టల్‌లోనే బ్యాలెన్స్, కాంట్రిబ్యూషన్, విత్‌డ్రాల్స్ వంటి ముఖ్యమైన వివరాలు చూడొచ్చు. అయితే పూర్తి గ్రాఫికల్ వివరాలు కావాలంటే పాత పాస్‌బుక్ పోర్టల్ లేదా UMANG యాప్ ఉపయోగించాలి.




















