సోమవారం జపాన్‌ను రిక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రతతో కూడిన శక్తిమంతమైన భూకంపం వణికించింది.భూకంపం కారణంగా జపాన్ ఉత్తర తీరంలో స్వల్ప సునామీ ఏర్పడింది. పసిఫిక్ తీర ప్రాంతాల్లో 50 సెంటీమీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడ్డాయి.కొన్ని చోట్ల 10 అడుగుల ఎత్తు మేర అలలు ఎగసిపడే అవకాశం ఉందని జపాన్ వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.ప్రభావిత ప్రాంతాల ప్రజలను వెంటనే ఎత్తైన ప్రదేశాలకు లేదా భవనాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.లేదంటే, తరలింపు కేంద్రాలలో ఆశ్రయం పొందాలని పేర్కొన్నారు.నష్టాన్ని అంచనా వేసేందుకు అత్యవసర టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రధాని సనాయె తకాయిచి వెల్లడించారు. ప్రజల ప్రాణాలు కాపాడటమే తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన పేర్కొన్నారు.భూకంప ప్రభావిత ప్రాంతంలోని అణువిద్యుత్ కేంద్రాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి సమస్యలూ గుర్తించలేదని సమాచారం.భూకంపం కారణంగా అవొమొరి పట్టణంలోని ఒక హోటల్‌లో కొందరు గాయపడ్డారు.హచినోహేకు ఈశాన్యంగా 80 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి దాదాపు 50 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ అధికారులు గుర్తించారు.




















