వన్డే ప్రపంచకప్‌లో బ్యాట్‌తోనూ, బంతితోనూ ఘన ప్రదర్శనతో స్పిన్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై 58 పరుగులు చేసి, 5 వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించింది. నేడు అందరి ప్రశంసలు అందుకుంటున్న దీప్తి, ఒకప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. కానీ ఆమె తండ్రి భగవాన్ శర్మ ఆ విమర్శలను పట్టించుకోకుండా కూతురి కల కోసం నిలబడ్డారు.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాలో 1997లో జన్మించిన దీప్తి చిన్నప్పటి నుంచే అన్న సుమిత్‌తో కలిసి క్రికెట్ ఆడేది. తల్లి మొదట్లో అభ్యంతరం తెలిపినా, ఆమె ఆటపట్ల ఉన్న పట్టుదల మాజీ క్రికెటర్ హేమలతా కాలా దృష్టిని ఆకర్షించింది. అలా ఏకలవ్య స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో క్రికెట్ శిక్షణ ప్రారంభమైంది. ఎనిమిదేళ్ల వయసులోనే తండ్రి ఆమెను స్టేడియానికి తీసుకెళ్లేవారు. “అమ్మాయిని క్రికెట్‌కి ఎందుకు పంపుతున్నావు?” అనే మాటలు విన్నా, ఆయన వెనుకడుగు వేయలేదు.
దీంతో దీప్తి క్రమంగా తన ప్రతిభను చాటుకుంది. 2016లో వన్డేలో 5 వికెట్లు తీసి ఆకట్టుకుంది. 2017లో పూనమ్ రౌత్‌తో 188 పరుగుల భాగస్వామ్యంతో వార్తల్లో నిలిచింది. ఇప్పటివరకు 121 వన్డేల్లో 2,739 పరుగులు, 162 వికెట్లు సాధించింది. టీ20ల్లోనూ, టెస్టుల్లోనూ విశేష ప్రతిభ కనబరిచింది. తాజాగా ప్రపంచకప్ ఫైనల్‌లో విజయం సాధించడంతో, ఆమె కుటుంబం ఆనందంలో మునిగిపోయింది.
“దీప్తి విజయంతో మా గర్వం మరింత పెరిగింది. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. ఇంట్లో దీపావళిలా వెలుగులు నిండిపోయాయి,” అని ఆమె తండ్రి భగవాన్ శర్మ ఆనందం వ్యక్తం చేశారు. “దీప్తిని ఈ స్థాయికి తీసుకెళ్లింది ఆమె అన్న సుమిత్ శ్రమే,” అని తల్లి సుశీల గర్వంగా తెలిపారు.




















