వర్షపు నీటిని సద్వినియోగం చేసుకుంటే, వివిధ రంగాల్లో ఉత్పాదకతను ప్రస్తుత స్థాయి కంటే ఆరు రెట్లు పెంచుకోవచ్చని, భూగర్భ జలాల మట్టం కనీసం మూడు మీటర్ల మేర పెరుగుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
గుంటూరులో సోమవారం ప్రారంభమైన వాటర్ షెడ్ మహోత్సవంపై జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా మాట్లాడిన ఆయన, రూ.13 వేల కోట్లతో వాటర్‌షెడ్ 2.0 పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకం కింద 21 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న వెంగళాయపాలెం చెరువును కేవలం 15 రోజుల్లో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామని, త్వరలోనే దేశానికి అంకితం చేస్తామన్నారు. వాటర్‌షెడ్ అంటే చెక్‌డ్యామ్ కాదని, గ్రామీణ భారత పునర్నిర్మాణానికి బలమైన పునాది అని మంత్రి వివరించారు.
ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళిక
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వచ్చే ఐదేళ్ల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని భూవనరుల విభాగం కార్యదర్శి మనోజ్ జోషి చెప్పారు. పథకం అమల్లో ముందుండే రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించే అంశంపైనా చర్చిస్తామన్నారు.
రైతుల లాభమే లక్ష్యం
రైతులకు లాభదాయకంగా ఉండే విధంగా ‘మోర్ క్రాప్ ఫర్ డ్రాప్’ అనేది వాటర్‌షెడ్ పథక నినాదం కావాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ సూచించారు.
కార్యక్రమంలో ‘ఎన్స్యూరింగ్ వాటర్ సెక్యూరిటీ, నర్చరింగ్ వేస్ట్‌ల్యాండ్, ఎంపవరింగ్ రూరల్ లైవ్లీహుడ్స్ – రాజస్థాన్’ అనే పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సంయుక్త కార్యదర్శి నితిన్ కడే, రాష్ట్ర పంచాయతీరాజ్ సంచాలకులు మైలవరపు కృష్ణతేజ, కలెక్టర్ తమీమ్ అన్సారియా, అదనపు కమిషనర్ సి.పి.రెడ్డి, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, వాటర్‌షెడ్ సంచాలకులు వీవీకే షణ్ముఖ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



















