పచ్చని పొలాల మధ్య నడుస్తూ స్వచ్ఛమైన గాలి పీలుస్తామా?
మట్టి దారులపై ఎద్దుల బండిపై విహరిద్దామా?
మంచె మీద కూర్చుని ఆలోచనల్లో మునిగిపోదామా?
ఇలాంటి అనుభవాలను అందించే వ్యవసాయ పర్యాటకాన్ని (అగ్రిటూరిజం) కేంద్ర ప్రభుత్వం రూపుదిద్దింది. పల్లె జీవనాన్ని దగ్గరగా అనుభవించడమే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ వైవిధ్యం, సాంస్కృతిక సంపదను పరిచయం చేయడమే దీని ఉద్దేశ్యం. 2005లో “అగ్రిటూరిజం ఇండియా” సంస్థను స్థాపించారు. స్వదేశీ దర్శన్, అప్నా దేశ్, వైబ్రెంట్ విలేజెస్ ప్రాజెక్టులలో కూడా దీనికి ప్రాధాన్యం ఇచ్చారు.
మహారాష్ట్రలోని పల్షివాడి గ్రామంలో మొదలైన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు దేశవ్యాప్తంగా 6,700 గ్రామాలకు విస్తరించింది. ఇప్పటివరకు సుమారు 1.20 కోట్ల మంది దేశీయ, విదేశీ పర్యాటకులు పల్లెపట్టులను సందర్శించారు. ఈ కార్యక్రమం పర్యాటకశాఖ, వ్యవసాయశాఖ, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు, రైతులు, టూర్ ఆపరేటర్ల సహకారంతో ముందుకు సాగుతోంది.
ఇక్కడ చేసే అనుభవాలు:
- రైతుల ఇళ్లలో వసతి.
- కోడి కూతలు, ఆవుల అంబరావాలతో ఉదయాన్నే మేల్కొలుపు.
- గ్రామీణ సంప్రదాయ దుస్తుల ధారణ.
- పల్లెటూరి ఆహార విందు.
- ఎద్దుల బళ్ళు, ట్రాక్టర్లపై విహారం.
- పొలం దున్నడం, కలుపు తీయడం, పంట కోయడం వంటి పనుల్లో పాల్గొనడం.
- పండ్ల తోటల్లో పండ్లు కోసుకోవడం, తినడం.
- గ్రామీణ చేతి వృత్తులు, ఉత్పత్తుల పరిచయం.
ఆంధ్రప్రదేశ్‌లో అవకాశాలు:
- కోనసీమలో కొబ్బరి, అరటి తోటలు.
- మదనపల్లెలో టమాట తోటలు.
- అరకులో అటవీ వ్యవసాయం.
- అనంతపురంలో వేరుశనగ తోటలు.
- చిత్తూరులో జీడిపప్పు తోటలు.
- కడియంలో పూల తోటలు.
- తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో చేపలు, రొయ్యల సాగు.
తెలంగాణలో అవకాశాలు:
- రంగారెడ్డిలో ద్రాక్ష, కందులు.
- మానుకోటలో మిర్చి.
- ఆదిలాబాద్‌లో పత్తి, సోయా.
- నల్గొండలో బత్తాయి.
- సిద్దిపేటలో కూరగాయలు.
- నిజామాబాద్‌లో గోదావరి తీర గ్రామాలు.
- ఆర్మూర్‌లో పసుపు.
- జగిత్యాలలో మామిడి.
- వరంగల్‌లో మిర్చి తోటలు.
- ఖమ్మంలో పామాయిల్ తోటలు.
అయితే ఇక్కడ పర్యాటకశాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఆసక్తి ఉన్నవారు స్వయంగా ఏర్పాట్లు చేసుకుని ఈ అనుభవాలను పొందవచ్చు.




















