తెలంగాణలో ‘అఖండ 2’ టికెట్‌ల విషయంలో ఏర్పడిన గందరగోళం తీరింది. టికెట్ ధరల పెంపుతో పాటు, ప్రత్యేక ప్రీమియర్ షోల కోసం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. బాలకృష్ణ కథానాయకుడుగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2) డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ టికెట్‌లను రూ.50 (జీఎస్టీతో), మల్టీప్లెక్స్‌లో రూ.100 (జీఎస్టీతో) పెంచడానికి అనుమతి ఇచ్చింది. డిసెంబరు 4న రాత్రి 8 గంటల షో కోసం ప్రత్యేకంగా రూ.600 (జీఎస్టీతో) ధరను నిర్ణయించింది. ఈ పెంపు ధరలు కేవలం మూడు రోజులు మాత్రమే అమల్లో ఉంటాయి.
పెంచిన టికెట్ ధరల ద్వారా వచ్చిన ఆదాయంలో 20% మూవీ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (MWA)కు వెళ్ళనుంది. చిత్ర పరిశ్రమలో పనిచేసే కార్మికుల సంక్షేమం కోసం ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ప్రత్యేక బ్యాంక్ ఖాతాను ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (FDC) ఓపెన్ చేసింది, దానిని లేబర్ కమిషనర్ పర్యవేక్షిస్తారు.




















