పీజీఆర్ఎస్‌తో పాటు 22ఏ, ఫ్రీ హోల్డ్‌లో ఉన్న అసైన్డ్ భూములు, రీ-సర్వే, ఆదాయ మరియు కుల ధృవీకరణ పత్రాలు వంటి కీలక అంశాలపై సమీక్ష జరిగింది. ఈ సమావేశానికి రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు హాజరయ్యారు. గత ఏడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1వ తేదీ వరకు మొత్తం 5,28,217 గ్రీవెన్సులు అందగా, అందులో 4,55,189ను పరిష్కరించగా, మిగతా 73 వేల ఫిర్యాదులు పరిశీలనలో ఉన్నాయి. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్ నుంచి ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతమైంది. జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తొలగించాలంటూ 6,846 దరఖాస్తులు అందగా, ఎక్స్-సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు మరియు 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వారి వివరాలు 22ఏ జాబితా నుంచి తొలగించబడ్డాయి. రాష్ట్రంలోని 6,693 గ్రామాల్లో రీ-సర్వే పూర్తి చేసి, వివరాలను వెబ్‌ల్యాండ్ 2.0లో నమోదు చేశారు. రికార్డుల అప్‌గ్రేడేషన్‌తో రీ-సర్వేలో పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకున్నారు. గత ప్రభుత్వ కాలంలో ఫ్రీ హోల్డ్‌లోకి వెళ్ళిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూములను మళ్లీ పరిశీలిస్తున్నారు. అలాగే 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలను ఆధార్‌తో అనుసంధానం చేశారు. స్టాంప్ మరియు రిజిస్ట్రేషన్ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10,169 కోట్ల ఆదాయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 430 రియల్ ఎస్టేట్ వెంచర్లకు సంబంధించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు చర్యలు తీసుకోగా, దీని ద్వారా 15,570 రిజిస్ట్రేషన్లు జరిగి రూ.250 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు.



















