వాణిజ్య విమానాలు, డిఫెన్స్, స్పేస్, హెలికాప్టర్ల తయారీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఎయిర్‌బస్‌ను మంత్రి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించారు. రాష్ట్రంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. దాదాపు రూ.16 లక్షల కోట్ల విలువైన వ్యవస్థను నడుపుతున్న ఆ సంస్థ పాలకమండలి భారత్‌లో తయారీకి ఉన్న అవకాశాల గురించి అన్వేషించడానికి తొలిసారి ఇక్కడికి వచ్చింది. ఎయిర్‌బస్ ఛైర్మన్ రెనె ఓబెర్మన్‌తోపాటు, ఆ సంస్థ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌ల ఆధ్వర్యంలో భారత్‌కు వచ్చిన పాలకమండలిని కలిసేందుకు లోకేశ్ దిల్లీకి వచ్చారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్‌నాయుడితో కలిసి మంగళవారం వారితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లోని వనరులు, పెట్టుబడుల అవకాశాల గురించి వివరించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి ఏరోస్పేస్ తయారీ కేంద్రంతోపాటు అనుబంధ సప్లై చైన్ సులభంగా ఏర్పాటు చేసుకోవడానికి ఉన్న అవకాశాల గురించి ప్రజంటేషన్ ఇచ్చారు.
సమీకృత కేంద్రం ఏర్పాటు చేయండి
ఆంధ్రప్రదేశ్‌లో సమీకృత కేంద్రం (ఇంటిగ్రేటెడ్ క్లస్టర్) ఏర్పాటు చేయాలని లోకేశ్ ఎయిర్‌బస్ బోర్డుకు విజ్ఞప్తి చేశారు. ప్రధాన వ్యవస్థతోపాటు సరఫరాదారులు, ఎంఎస్‌ఎంఈ, ఇతర భాగస్వామ్య పక్షాలు ఒకేచోట కార్యకలాపాలు నిర్వహించుకుంటే తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేయొచ్చన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బహుళ ఏరోస్పేస్ కారిడార్లను అభివృద్ధి చేస్తున్నామని, వాటిలో తమ అవసరాలకు తగ్గట్టు ఇష్టమైన వాటిని ఎంచుకోవచ్చని చెప్పారు. అందుబాటులో ఉన్న స్థలాల్లో దేన్నయినా ఎంచుకొనే స్వేచ్ఛ ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్, ట్రాక్ రికార్డు గురించి వారికి తెలిపారు. విభిన్న రంగాల నుంచి ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నినాదంతో ఏపీ ప్రభుత్వం వేగంగా అనుమతులు ఇస్తోందన్నారు.


ఎయిర్‌బస్ ఛైర్మన్ రెనె ఓబెర్మన్‌తో మంత్రి లోకేశ్ కరచాలనం
ఏపీ అన్ని రకాలా అనుకూలం
ఎయిర్‌బస్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నట్లు మంత్రి లోకేశ్ సమావేశానంతరం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ప్రపంచ ఏరోస్పేస్ రంగంలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు ఎయిర్‌బస్ చిహ్నం. సంక్లిష్టమైన దాని తయారీకి అవసరమైన పూర్తిస్థాయి వసతులు కల్పించడానికి ఆంధ్రప్రదేశ్ సంసిద్ధంగా ఉంది’ అని ప్రకటించారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మంచి విధానాలు రూపొందించి, పెట్టుబడులను ఆకర్షించడానికి వేగంగా ప్రయత్నిస్తోందన్నారు.
సిద్ధంగా భూములు
ఎయిర్‌బస్ ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూపితే అంతా సిద్ధం చేసిన భూమిని ఇస్తామని, దానివల్ల వెంటనే (ప్లగ్ అండ్ ప్లేలో) కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని లోకేశ్ వివరించారు. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, లాజిస్టిక్స్‌కు అనుసంధానంగా ఉండే మల్టీకారిడార్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఇప్పటికే ఏరోస్పేస్ పాలసీని సిద్ధం చేశామని, దీనివల్ల రాష్ట్రంలో మొదలుపెట్టబోయే ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగడానికి వీలవుతుందని పేర్కొన్నారు. ఎగుమతులకు అనువైన ఏరోస్పేస్ హబ్‌ను తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వనరులూ అందుబాటులో ఉన్నాయన్నారు.



















