జీవితంలో పెను సమస్యలు ఉత్పన్నమైనప్పుడు కొందరు ధైర్యం కోల్పోతుంటారు. ఏం చేయాలో తోచక బాధపడుతుంటారు. అలాంటప్పుడు భీష్మపితామహుడి మాటలను గుర్తుచేసుకోవాలన్నది పెద్దల హితవు. అవి కష్టసమయంలో మనోధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తాయి. అవేమిటో చూద్దామా..
- ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా ధర్మాన్నే అనుసరించాలి. బాధ్యతలను విస్మరించకూడదు. ఓర్పుతో, విశ్వాసంతో ముందుకు సాగాలి.
- స్వీయ నియంత్రణ అనేది అతి పెద్ద ఆయుధం. దుర్భర స్థితిలోనూ కోపతాపాలను ప్రదర్శించక.. తనను తాను నియంత్రించుకోవాలి. ప్రశాంతంగా ఉంటేనే సరైన నిర్ణయం తీసుకోగలరు.
- కాలం అమూల్యమైంది. దాని శక్తి ఎంతటిదంటే.. అది దేన్నయినా, ఎవరినైనా మార్చగలదు. ఈ విషయాన్ని గ్రహించినప్పుడు అలజడికి తావుండదు. కర్తవ్యం బోధపడుతుంది.
- విచక్షణే యోధుల లక్షణం. సమస్యలు ఆత్మపరిశీలన చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి. వాటినెలా అధిగమించాలనే యోచన కుంగుబాటుకు బదులు ఉత్సాహాన్నిస్తుంది. భీష్ముడు ప్రబోధించిన ఈ అంశాలను అనుసరించగలిగితే ప్రతికూలత కూడా అనుకూలంగా మారతాయి.
















