శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి అనేక నైవేద్యాలు సమర్పిస్తుంటాం కదా! ఈసారి కొంచెం ప్రత్యేకంగా బీరకాయ గారెలు చేసి నివేదించండి. ప్రసాదంగా సేవించి ప్రత్యేకమైన రుచిని ఆస్వాదించండి.
కావలసినవి: మినప్పప్పు – ఒక కప్పు, ఉల్లిపాయ, బీరకాయ – ఒక్కొకటి, పచ్చిమిర్చి – 4, అల్లం – అంగుళం ముక్క, కరివేపాకు – 2 రెబ్బలు, నువ్వులు – 2 చెంచాలు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి సరిపడా
తయారీ: మినప్పప్పును రాత్రి నానబెట్టి ఎక్కువ నీరు వేయకుండా గట్టిగా ఉండేలా రుబ్బుకోవాలి. బీరకాయ చెక్కు తీసి.. తురిమి నీటిని వడకట్టేయాలి. కరివేపాకు, మిర్చి, అల్లం, ఉల్లిపాయలను తరిగి ఉంచాలి. మినప్పప్పులో బీరకాయ తురుము, మిర్చి, అల్లం, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, నువ్వులు వేసి కలపాలి.
చేతికి నీళ్లు రాసుకుని మినప్పిండితో గారెలు చేసి.. కాగుతున్న నూనెలో బంగారు రంగు వచ్చే వరకూ వేయించాలి. సెగ మరీ ఎక్కువ తక్కువ కాకుండా మధ్యస్తంగా ఉంటే గారెలు చక్కగా వేగుతాయి. వాటిని టిష్యూపేపర్ మీదికి తీస్తే.. అదనపు నూనెను పీల్చేసుకుంటాయి. ఇక కొబ్బరి లేదా అల్లం చట్నీతో వడ్డించండి. కొన్ని ఉల్లిపాయ ముక్కలు జోడిస్తే మరింత టేస్టీగా ఉంటాయి. వీటిని అరిటాకులో అమర్చారంటే.. పండుగ శోభ కనిపిస్తుంది. పిల్లలు గారెలను ఇష్టపడతారు. ఇలా బీరకాయ జోడించి గారెలు చేస్తే పోషకాలు అందుతాయి.




















