పంజిమ్ (గోవా): ఫిడే చెస్ ప్రపంచకప్‌కు ముహూర్తం సిద్ధమైంది. 80 దేశాల నుండి 206 మంది ప్రముఖ ఆటగాళ్లు తలపడబోతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ శనివారం నుంచి ప్రారంభమవుతుంది. సొంత నేలపై జరుగుతున్న ఈ పోటీలో ప్రపంచ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్, యువ ప్రతిభలు అర్జున్ ఇరిగేశి, ప్రజ్ఞానందపైనే అభిమానుల దృష్టి కేంద్రీకృతమైంది. నాకౌట్ పద్ధతిలో జరిగే ఈ పోటీలో మ్యాచ్‌లు క్లాసికల్ ఫార్మాట్లో జరుగుతాయి. ప్రతి రౌండ్‌లో రెండు గేమ్‌లు ఉంటాయి.
ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచే ఆటగాళ్లు 2026 క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత పొందనున్నారు. అయితే ఇప్పటికే ప్రపంచ ఛాంపియన్‌గా ఉన్న గుకేశ్‌కు ఈ అర్హత అవసరం లేదు — అతడి దృష్టి టైటిల్ గెలుపుపైనే ఉంది. ఇటీవల ఫామ్ కోల్పోయిన గుకేశ్ ఈ కప్ ద్వారా తిరిగి తన ప్రతిభను నిరూపించుకోవాలని చూస్తున్నాడు.
యువ తారలు ప్రజ్ఞానంద, అర్జున్‌లతో పాటు సీనియర్ ఆటగాళ్లు పెంటేల హరికృష్ణ, విదిత్ గుజరాతి కూడా క్యాండిడేట్స్ టోర్నీ అర్హత కోసం బరిలోకి దిగుతున్నారు. మహిళల ప్రపంచకప్ విజేత దివ్య దేశ్‌ముఖ్ కూడా ఈ పోటీలో పాల్గొనడం విశేషం.
మొత్తం భారత్ నుంచి 24 మంది ఆటగాళ్లు ఈ ప్రపంచకప్‌లో పోటీ పడనుండగా, వారిలో తెలంగాణకు చెందిన యువ చెస్ మాస్టర్ రాజా రిత్విక్ కూడా ఉన్నాడు. ఈ ఏడాది ఆసియా ఛాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రిత్విక్ ఈ సారి ఎలా ఆడతాడో చూడాలి.
అయితే ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్, అమెరికా గ్రాండ్‌మాస్టర్లు ఫాబియానో కరువానా, నకముర ఈ టోర్నీలో పాల్గొనకపోవడం గమనార్హం.
టాప్-50 ర్యాంక్ ఉన్న ఆటగాళ్లు నేరుగా రెండో రౌండ్ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ నేపథ్యంలో ఫిడే చెస్ ప్రపంచకప్ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.




















