సత్యసాయి జయంతి వేడుకల నేపథ్యంలో చిత్రావతి నది సుందరీకరణ పనులు చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా స్నానఘాట్‌ను కూడా ఏర్పాటు చేశారు. అయితే తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో, భక్తులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలి వర్షాల కారణంగా చిత్రావతి నది నీటితో నిండిపోగా, జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఈ నది అందమైన దృశ్యాలతో పర్యాటకులను ఆకర్షిస్తోంది. చెక్‌డ్యాం మరియు ఎనుములపల్లి చెరువూ నిండిపోయాయి. అయితే, ఈ ప్రాంతాలు ఇప్పుడు పర్యాటకులు మరియు భక్తులకు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
రాబోయే రెండు వారాల్లో పుట్టపర్తిలో సత్యసాయి శతజయంతి వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా లక్షలాది భక్తులు పాల్గొననున్నట్లు అంచనా. సత్యసాయి స్వయంగా నడిచిన పవిత్ర చిత్రావతి నదిని భక్తులు అత్యంత భక్తితో పుణ్యస్నానాల కోసం దర్శించనున్నారు. అందుకోసం నదీ తీరంలో హారతి ఘాట్ నిర్మించారు.
సుందరీకరణ పనుల పేరుతో నది తీరంలోని చెట్లు తొలగించి, కొత్తగా మట్టి వేసినట్లు సమాచారం. అయితే నదిలో లోతు తెలియని భక్తులు నీటిలోకి దిగితే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. హారతి ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన మెట్ల క్రింద సుమారు పది అడుగుల లోతు నీరు ఉంది. అప్రమత్తం లేకుండా జారిపడితే ప్రాణాపాయం తలెత్తవచ్చని చెబుతున్నారు.
గతంలో కూడా ఇదే ప్రాంతంలో పలువురు ప్రమాదాలకు గురైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే ఎనుములపల్లి చెరువు వద్ద రహదారి చాలా ఇరుకుగా ఉండడం వల్ల వేగంగా వెళ్తున్న వాహనాలు అదుపు తప్పి చెరువులో పడే ప్రమాదం ఉందని అంటున్నారు.
సుందరీకరణ పనులు చేసినప్పటికీ, చిత్రావతి పరివాహక ప్రాంతంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం విమర్శలకు కారణమవుతోంది. భారీగా భక్తులు వచ్చే ఈ వేడుకల సమయంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు అధికారులు కోరుతున్నారు.




















