రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేస్తున్న కొత్త రేషన్ కార్డులు కేవలం బియ్యం సరఫరాకు మాత్రమే పరిమితమవడంతో, ఆ కార్డులు పొందిన లబ్ధిదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్డులపై ఇతర సంక్షేమ పథకాలు వర్తించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని ప్రకటించింది — మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సాయం, రైతులకు రుణమాఫీ, ఎకరాకు రూ.6 వేల పెట్టుబడి సాయం, కూలీలకు ఆర్థిక సహాయం, గృహలక్ష్మి పథకం కింద ఉచిత విద్యుత్, రూ.500కే సబ్సిడీ గ్యాస్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు అందుబాటులోకి తెచ్చింది.
గత ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసిన అనేక మందికి ఆ కార్డులు అందకపోగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. ఆగస్టు నుంచి ఈ కార్డులపై ఉచిత రేషన్ బియ్యం అందిస్తోంది. అయితే గృహలక్ష్మి, ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ వంటి పథకాలు వీరికి వర్తించడం లేదు.
దీంతో కొత్త కార్డుదారులు నిరాశ, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన వెబ్‌సైట్‌లో కొత్త దరఖాస్తులు చేసుకునే అవకాశం లేకపోవడంతో, వారు వివిధ కార్యాలయాలను చుట్టుముట్టినా ఉపయోగం లేకుండా పోతోందని చెబుతున్నారు.
జిల్లాలో మొత్తం 413 రేషన్ షాపుల పరిధిలో 2.35 లక్షల కార్డులు, వాటి ద్వారా 7.29 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. తాజాగా మరో 14 వేల కొత్త కార్డులు జారీ అయ్యాయి. రేషన్ కార్డు పొందిన కుటుంబాలకు ఒక్కో సభ్యుడికి నెలకు 6 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందజేస్తున్నారు.
అయితే ప్రజాపాలనలో రేషన్ కార్డులు నమోదు కానివారికి ఇతర పథకాలు అందడం లేదు. అధికారులు ఇది నిరంతర ప్రక్రియ అని చెబుతున్నప్పటికీ, ప్రస్తుతం కొత్త దరఖాస్తులు స్వీకరించడం లేదు.
కొత్త కార్డుదారులు ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు అవకాశం ఇవ్వాలని, ఆన్‌లైన్ దరఖాస్తు సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.



















