ఇంధన భద్రత కోసం మెరుగైన రక్షణ విధానాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదే సమయంలో టెక్నాలజీని వినియోగించి… ప్రజలకు లబ్ది కలిగేలా విద్యుత్ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలు ఉండాలని అభిప్రాయపడ్డారు. శనివారం సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా ఇంధన భద్రత, విద్యుత్ రంగంలో అధునాతన టెక్నాలజీ వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వం వరల్డ్ ఎకనమిక్ ఫోరంతో ఒప్పందం కుదుర్చుకుంది. సెంటర్ ఫర్ ఎనర్జీ, సైబర్ రెజిలియన్స్ సెంటర్ ఏర్పాటుపై WEFతో ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఈ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ…‘ఇంధన రంగంలో అవసరమైన సైబర్ రక్షణ వ్యవస్థలను కూడా తయారు చేసుకోవాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు WEF ముందుకు రావడం సంతోషం. ప్రపంచం అంతా గ్రీన్ ఎనర్జీ వినియోగం గురించే ఆలోచన చేస్తోంది. 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఏపీలో ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అతితక్కువ వ్యయంతో విద్యుత్ ఉత్పత్తి చేసి సరఫరా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సంస్కరణలు చేసి వినియోగాన్ని పెంచగలిగాం. ఏఐ లాంటి టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్ పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గించాలి. అప్పుడే ఇంధన రంగంలో సుస్థిరత సాధ్యం అవుతుంది. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు, గృహాలు ఇలా అన్నిటికీ ఇలా ప్రతి రంగానికీ విద్యుత్ అవసరమే. ఈ మేరకు విద్యుత్ డిమాండ్ ను తట్టుకునేందుకు… మరింత విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా ప్రజలకు లాభాలు కల్గించేలా…మరింత మేలు జరిగేలా…ఎక్కడికక్కడే విద్యుత్ ఉత్పత్తి చేసుకునేలా విధానాలను కూడా తయారు చేసుకుంటున్నాం. ట్రాన్స్ మిషన్ నష్టాలను కూడా గణనీయంగా తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టాం. పునరుత్పాదక విద్యుత్ రంగంలో ప్రజలకు ప్రయోజనాలు కలిగేలా వ్యవస్థలు ఉండాలి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఏపీలో సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్టును వేగంగా చేపట్టాం.”అని ముఖ్యమంత్రి వివరించారు.



















