మంత్రులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం
అనుమతులు పొందిన సంస్థలు తమ వద్దకే రావడం లేదన్న మంత్రి దుర్గేష్
అమరావతి: “ఎన్నికల్లో పోటీ చేయాల్సింది మనమే, అధికారులు కాదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు స్పష్టంగా గుర్తు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే క్రమంలో రాజకీయంగా కూడా లాభం వచ్చేలా చూడాల్సిన బాధ్యత మంత్రులదేనని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడి ఒప్పందాలు కేవలం కాగితాలపై కాకుండా ఆచరణలోకి రావాలని, ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా మంత్రులు ముందుండాలని ఆదేశించారు. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో విధిగా పాల్గొని, ప్రజల్లో తమ కృషిని తెలియజేయాలని సూచించారు.
మంత్రివర్గ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రస్తావించిన అంశంపై సీఎం స్పందించారు. సంస్థల ప్రతినిధులు అధికారులను మాత్రమే సంప్రదించి, మంత్రులను పట్టించుకోవడం లేదని దుర్గేష్ చెప్పగా, సీఎం అన్నారు — “మంత్రులే డ్రైవింగ్ ఫోర్స్. శాఖల కార్యకలాపాలకు మీరు బాధ్యత వహించాలి. కంపెనీలు వస్తే మీరు వారిని పిలిపించి మాట్లాడండి. ప్రాజెక్టులు త్వరగా మొదలయ్యేలా కృషి చేయండి. మీరు పాల్గొన్నప్పుడే మీ పేరుతో ఆ ప్రాజెక్టులు గుర్తింపుతెచ్చుకుంటాయి. లేదంటే, అధికారులు చేసి వెళ్లిపోతారు; కానీ ఎన్నికలకు వెళ్లాల్సింది వాళ్లు కాదు, మనమే” అని స్పష్టంచేశారు.
గత ఏడాదిన్నర కాలంలో రాష్ట్రానికి ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు రాలేదని, ఆకర్షణీయమైన రాయితీలు ఇవ్వడం వల్లే ప్రపంచ దిగ్గజ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌పై విశ్వాసం చూపుతున్నాయని సీఎం అన్నారు.
గోవధపై నిబంధన తప్పనిసరి
మల్లవల్లి పారిశ్రామికవాడలో ఫెయిర్ ఎక్స్‌పోర్ట్స్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రతిపాదనపై చర్చ సందర్భంగా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, పండ్లు, మాంసం ప్రాసెసింగ్ చేస్తామని పేర్కొన్నా, ఏ మాంసమో స్పష్టంగా చెప్పలేదని చెప్పారు. “అక్కడ గోవధ లేదా గోమాంసం ప్రాసెసింగ్ చేయరాదని స్పష్టమైన నిబంధన పెట్టాలి,” అని సూచించారు. అలాగే, లులు గ్రూప్ సాధారణంగా కేరళ సిబ్బందిని నియమించుకుంటుందన్న కారణంగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సూచించారు.
పెట్టుబడిదారులకు ప్రభుత్వ భరోసా
విశాఖలో లులు మాల్ అద్దె పెంపు నిబంధనలపై చర్చ జరుగగా, మంత్రి నాదెండ్ల మనోహర్ అన్ని సంస్థలకు ఒకే విధమైన నిబంధనలు ఉండాలని అభిప్రాయపడ్డారు. దీనిపై సీఎం స్పందిస్తూ, “వైకాపా ప్రభుత్వం లులు గ్రూప్‌పై అనవసర ఒత్తిళ్లు తెచ్చి పంపించింది. ఇప్పుడు వారు మన ప్రభుత్వంపై నమ్మకంతో తిరిగి వస్తున్నారు. అందుకే వారికి ప్రోత్సాహం అవసరం” అన్నారు. పవన్ కల్యాణ్ కూడా “ఇలాంటి సంస్థలకు ప్రభుత్వం పూర్తి భరోసా ఇవ్వాలి” అని పేర్కొన్నారు.
మరో ముంబయిలా విశాఖ
టెక్ దిగ్గజాలు స్థాపిస్తున్న ప్రాజెక్టులతో 2028 నాటికి విశాఖలో లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు రాబోతున్నాయని, తదుపరి 15–20 ఏళ్లలో విశాఖ ముంబయిలా అభివృద్ధి చెందుతుందని సీఎం చెప్పారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించామని, రైల్వే జోన్ సాధించామని, భారీ పెట్టుబడులు తీసుకొస్తున్నామని గుర్తుచేశారు. రైడెన్ డేటా సెంటర్ ప్రాజెక్టు కేంద్ర సహకారంతోనే సాధ్యమైందని, ఈ నెల 14న దిల్లీలో ఒప్పందం కుదుర్చుకోనున్నామని తెలిపారు.
మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్లండి
మంత్రులు మరింత చురుకుగా వ్యవహరించి, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని సీఎం సూచించారు. “విద్యుత్ చార్జీలను యూనిట్‌కు 13 పైసలు తగ్గించాం, కానీ దానిపై మంత్రులు ఓనర్‌షిప్ తీసుకోలేదు. ప్రజలకు మేలు చేసే ప్రతి నిర్ణయాన్ని వివరించాలి. ప్రజల్లో సానుకూల భావన ఏర్పడితేనే తదుపరి ఎన్నికల్లో విజయం సాధించగలం” అని సీఎం చెప్పారు.
అలాగే, పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవం కలిగించేలా ‘స్కావెంజర్’ వంటి పదాల స్థానంలో మరింత గౌరవప్రదమైన పేర్లు ఉపయోగించాలని సూచించారు.
వైకాపా కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి
మంత్రి నారా లోకేశ్ సహచర మంత్రులకు సూచిస్తూ, “వైకాపా కుట్రలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయి. కల్తీ మద్యం కేసుల్లో నిందితులు మన పార్టీలోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేశారు; వారి తప్పుల ప్రభావం మనపై పడకూడదు. ఇలాంటి వారిని క్షమించరాదు” అని హెచ్చరించారు.
మంత్రివర్గ సమావేశానికి ముందు లోకేశ్ తన ఉండవల్లి నివాసంలో మంత్రులకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై చర్చలో మంత్రి సవిత్‌తో స్వల్ప వాగ్వాదం జరిగినట్లు సమాచారం.




















