తిరుమల: తిరుమలలో పరకామణి కేసుకు సంబంధించిన ఫిర్యాదు దారుడు, మాజీ ఏవీఎస్వో సతీశ్ కుమార్ అనుమానాస్పదంగా మృతిచెందారు. ఆయన శవాన్ని అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్ వద్ద కనుగొన్నారు.
పరకామణి కేసులో విదేశీ డాలర్లు దొంగతనం చేసిన రవికుమార్‌పై సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదుచేసి పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరిచినప్పటికీ, అప్పట్లో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, పోలీసులు ఒత్తిడికి కారణమై సతీశ్ కుమార్ కేసు న్యాయస్థానంలో రాజీ అయ్యారు. దీనిపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం కేసును ప్రస్తుతం దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తు కీలక దశకు చేరుకున్న సమయంలో, కేసు రాజీ చేసుకున్న సతీశ్ అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం సృష్టించింది.
సతీశ్ నేపథ్యం
సతీశ్ కుమార్ ప్రస్తుతం గుంటకల్లో జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా పత్తికొండ. హుండీ సొమ్ము లెక్కింపు సమయంలో, సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ చోరీ చేస్తున్న సమయంలో విజిలెన్స్ విభాగంలో ఉన్న సతీశ్ ఆయనను పట్టుకున్నారు.
2023 ఏప్రిల్‌లో సతీశ్ రవికుమార్‌పై ఫిర్యాదు చేశారు. 2023 మే 30న విజిలెన్స్ అధికారులు రవికుమార్‌పై ఛార్జ్‌షీట్ ఫైల్ చేశారు. కేసు నుంచి తప్పిస్తే తన ఆస్తులు తితిదేకి ఇస్తానని రవికుమార్ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై వైకాపా నేతలు ఆస్తులపై దృష్టి సారించారు. కొన్ని ఆస్తులను విరాళంగా తీసుకోవడం కోసం తితిదే బోర్డు నిర్ణయం తీసుకుంది.
2023 సెప్టెంబర్ 9న లోక్‌అదాలత్‌లో కేసును వైకాపా నేతలు రాజీ చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరకామణి వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. 2024 సెప్టెంబర్ నుండి రవికుమార్ కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లింది. మరోవైపు, హైకోర్టు ఇటీవల పరకామణి కేసును మళ్లీ విచారించాలని సీఐడీని ఆదేశించింది.




















