దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. దీపావళి అనంతరం కాలుష్య స్థాయి మరింత పెరిగిపోవడంతో ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. మంగళవారం దిల్లీ వాయు నాణ్యత సూచీ (AQI) 306గా నమోదై, ‘తీవ్రమైన కాలుష్యం’ విభాగంలోకి చేరిందని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) వెల్లడించింది.
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, కాలుష్యాన్ని తగ్గించేందుకు దిల్లీ ప్రభుత్వం కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించే నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం క్లౌడ్ సీడింగ్ (Cloud Seeding) ప్రక్రియను పూర్తిచేసింది. ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టగా, అక్కడి నుంచి బయల్దేరిన విమానం సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్ వంటి రసాయనాలను వాయుమండలంలోని మేఘాలపై స్ప్రే చేసింది. దీని ద్వారా కొన్ని గంటల్లో వర్షం కురిసే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
దిల్లీ ప్రభుత్వం గత సెప్టెంబర్ 25న ఐఐటీ కాన్పూర్‌తో ఐదు క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ నిర్వహించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (DGCA) అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 మధ్య ట్రయల్స్ నిర్వహించేందుకు అనుమతిచ్చింది. ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 3.21 కోట్లు బడ్జెట్‌ను దిల్లీ మంత్రివర్గం గత మేలో ఆమోదించింది.
వాతావరణ మార్పులు, రుతుపవన ప్రభావం కారణంగా ఈ ప్రక్రియ పలు మార్లు వాయిదా పడినప్పటికీ, ఇప్పుడు చివరికి క్లౌడ్ సీడింగ్ ప్రక్రియ పూర్తయింది. దాంతో దిల్లీలో వర్షం కురిసి, కాలుష్యం కొంత మేర తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.




















